ఆసియా కప్‌లో పాకిస్థాన్ హైడ్రామా రక్తికట్టించింది. భారత ప్లేయర్లు తమకు షేక్‌హ్యాండ్ ఇవ్వకపోవడానికి మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ కారణమంటూ పీసీబీ చిందులు తొక్కింది. బుధవారం యూఏఈతో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ టీమ్, పీసీబీ పగటి వేషాలు వేశాయి. షేక్‌హ్యాండ్ వివాదానికి రిఫరీ పైక్రాఫ్ట్ ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఐసీసీకి పీసీబీ మరో లేఖాస్త్రం సంధించింది. ఈ విషయంలో పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పాల్సిందేనని పేర్కొంటూ పీసీబీ లేఖ రాసింది. మ్యాచ్ మొదలుకావడానికి రెండు గంటల ముందు స్టేడియానికి చేరుకోవాల్సి ఉన్నా..పాక్ టీమ్ హోటల్ రూమ్లకే పరిమితమైంది. పీసీబీ ఆదేశాల మేరకు ప్లేయర్లు హోటల్లోనే ఉండిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన రిఫరీ పైక్రాఫ్ట్ ఈ విషయాన్ని పీసీబీ చైర్మన్, ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) హెడ్ మోహిసిన్ నక్వితో పాటు ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా దృష్టికి తీసుకెళ్లాడు.
ఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టారు. ఇందులో రిఫరీ పైక్రాఫ్ట్‌ది ఎలాంటి తప్పిదం లేదని, నిబంధనల ప్రకారమే అతను వ్యవహరించాడని ఐసీసీ కరాఖండిగా చెప్పడంతో పాటు వివాదాన్ని నక్వీతో పాటు టోర్నీ డైరెక్టర్ అండీ రస్సెల్ ముందు ఉంచింది. ఒకవేళ టోర్నీ నుంచి తప్పుకుంటే 16 యూఎస్ మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ కోల్పోవాల్సి వస్తుందని పీసీబీకి స్పష్టం చేసింది. దీంతో మల్లాగుల్లాలు పడ్డ పీసీబీ..మాజీ చైర్మన్లు రమీజ్రాజా, నజామ్ సేథీతో మాట్లాడి ఆడేందుకు మొగ్గుచూపింది. ఈ కారణంగా షెడ్యూల్ ప్రకారం 8 గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పిన తర్వాతే మేము మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకున్నామని పీసీబీ ట్వీట్ చేసింది.