Mohammad Nabi : ప్రపంచ క్రికెట్లో మరో అల్రౌండర్ కెరీర్ ముగించనున్నాడు. అఫ్గనిస్థాన్ లెజెండరీ ఆల్‌రౌండర్ మహమ్మద్ నబీ (Mohammad Nabi) సదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకబోతున్నాడు. అఫ్గన్ జట్టులో కీలక ఆటగాడైన నబీ వన్డేలకు త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరుగబోయే చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) అనంతరం నబీ 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి వైదొలగుతాడట. ఈ విషయాన్ని శుక్రవారం అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నసీబ్ ఖాన్ (Naseeb Khan) వెల్లడించాడు.
‘అవును. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం వన్డేలకు నబీ వీడ్కోలు పలకనున్నాడు. ఈ విషయాన్ని అతడు బోర్డు సభ్యులకు ఇప్పటికే తెలిజయజేశాడు. నేను వన్డేలకు రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నా. పాక్ ఆతిథ్యమివ్వనున్న చాంపియన్స్ ట్రోఫీ నాకు ఆఖరిది అని కొన్నిరోజుల క్రితం నబీ నాతో అన్నాడు. అతడి నిర్ణయాన్ని నాతోపాటు బోర్డు సభ్యులు కూడా స్వాగతించారు. ఇకపై నబీ 20 ఫార్మాట్, ఫ్రాంచైజీ క్రికెట్ మీద దృష్టి పెట్టనున్నాడు’ అని నసీబ్ తెలిపాడు.
🚨 Mohammad Nabi set to retire from ODIs after #ChampionsTrophy2025 👏
READ: https://t.co/JepLDSAEJN#CricketTwitter #AFGvsBAN #AFGvBAN pic.twitter.com/LUamwLnpxI
— Cricbuzz (@cricbuzz) November 8, 2024
స్పిన్ ఆల్‌రౌండర్ అయిన నబీ 2009లో వన్డే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 165 మ్యాచ్‌లు ఆడిన నబీ 3,549 పరుగులు సాధించడమే కాకుండా బంతితో తిప్పేస్తూ 27.30 సగటుతో 171 వికెట్లు పడగొట్టాడు. తాజాగా షార్జా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో నబీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 82 పరుగులతో రాణించిన ఈ ఆల్‌రౌండర్ జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించాడు. అనంతరం బంగ్లాను 143కే కట్టడి చేసిన అఫ్గన్ జట్టు మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.