IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలానికి ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు హెడ్‌కోచ్‌ల మార్పు, ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడం వంటివి పూర్తి చేశాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఫ్రాంచైజీ యజమాన్యం జట్టును అమ్మకానికి పెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సీవీసీ (CVC) క్యాపిటల్ పార్ట్నర్స్ కంపెనీ ఫ్రాంచైజీని గంపగుత్తగా అమ్మేసేందుకు సిద్ధమైంది.
దాంతో, ఆ టీమ్‌ను పూర్తిగా హస్తగతం చేసుకునేందుకు పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ (Adanai Group), టొరెంట్ గ్రూప్ (Torrent Group)లు పావులు కదుపుతున్నాయంటూ శుక్రవారం ఓ వార్త కథనం వెలువడింది. ఐపీఎల్‌లోని కొత్త జట్లు తమ వాటాను అమ్ముకునేందుకు బీసీసీఐ 2025 ఫిబ్రవరి వరకు అనుమతిచ్చింది. దాంతో, నిర్దేశించిన గడువు లోపే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.
‘2021లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకునే అవకాశాన్నిగుజరాత్, టొరెంట్ గ్రూప్‌లు కోల్పోయాయి. దాంతో, ఈసారి ఎలాగైనా టీమ్‌ను కొనాలని రెండు గ్రూప్‌లు పట్టుదలతో ఉన్నాయి. దాంతో, సీవీసీ కంపెనీకి ఇంతకంటే మంచి సమయం దొరకదేమో’ అని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. సీవీసీ గ్రూప్ 2021లో రూ.5,625 కోట్లకు గుజరాత్ ఫ్రాంచైజీని కొన్నది. ప్రస్తుతం టోరెంటో గ్రూప్‌లకు అమ్మబోయే ధర రూ. 83 వేల కోట్ల నుంచి రూ 1.25 లక్షల కోట్ల మధ్య ఉండవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ అడుగుపెట్టి మూడేండ్లు అవుతోంది. తొలి సీజన్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో గుజరాత్ చాంపియన్‌గా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా 16వ సీజన్ ఆడిన గుజరాత్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

అయితే.. మినీ వేలానికి ముందు హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్‌కు అప్పగించి..పదిహేడో సీజన్లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలో బరిలోకి దిగింది. కానీ, సీనియర్ పేసర్ మహ్మద్ షమీ లేకపోవడం, టాపార్డర్ వైఫల్యంలో ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. అందుకని 18వ సీజన్లో పకడ్బందీగా టైటిల్ వేటకు సిద్ధమవ్వాలని గిల్ బృందం భావిస్తోంది.
