శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 24, 2020 , 00:28:20

శరత్‌, సాతియాన్‌ జోడీకి రజతం

శరత్‌, సాతియాన్‌ జోడీకి రజతం

బుడాపెస్ట్‌: భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి మెరిశారు. ఐటీటీఎప్‌ వరల్డ్‌ టూర్‌ హంగేరీ ఓపెన్‌లో  పురుషుల డబుల్స్‌లో  ఆచంట శరత్‌ కమల్‌-జ్ఞానశేఖరన్‌ సాతియాన్‌ జోడి రజత పతకం సొంతం చేసుకున్నది. ఆదివారం జరిగిన ఫైనల్లో శరత్‌-సాతియాన్‌ జంట 1-3 (5-11, 9-11, 11-8, 9-11)తో బెనెడిక్ట్‌ డుడా-ప్యాట్రిక్‌ ఫ్రాన్జిస్కా (జర్మనీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు సెమీస్‌లో టాప్‌ సీడ్‌ హాంకాంగ్‌ జంటను 3-2తో చిత్తుచేసిన భారత ఆటగాళ్లు.. తుదిపోరులో అలాంటి ప్రదర్శన కొనసాగించ లేకపోయారు. తొలి రెండు గేమ్‌లు ఓడిన ఈ జోడి మూడో గేమ్‌లో సత్తాచాటినా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీలో శరత్‌ కమల్‌కు ఇది రెండో పతకం. అంతకుముందు మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత స్టార్‌ ప్లేయర్‌ మనికా బాత్రాతో కలిసి కాంస్యం గెలుచుకున్న శరత్‌.. ఇప్పుడు రజతం ఖాతాలో వేసుకున్నాడు.


logo