ఆసియా కప్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. గ్రూప్ దశలో అజేయంగా ఉన్న టీమ్ఇండియా.. సూపర్-4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఈ టోర్నీలో రెండోసారి ఓడించి ఫైనల్ దిశగా ముందడుగు వేసింది. భారత ఫీల్డింగ్ వైఫల్యాలతో గత మ్యాచ్ కంటే ఈసారి ప్రత్యర్థి ఎదుట కాస్త పోరాడగలిగే లక్ష్యాన్ని నిలిపిన పాక్.. బౌలింగ్‌లో మాత్రం తేలిపోయింది. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ విధ్వంసకర ఆటతో పాక్ బౌలింగ్‌ను బెంబేలెత్తించారు. ఈ మ్యాచ్‌లోనూ భారత్ ‘నో షేక్ హ్యాండ్’ విధానాన్నే కొనసాగించింది.
దుబాయ్: ఆసియా కప్‌లో ఓటమన్నదే లేకుండా సాగుతున్న భారత్ మరో అద్భుత విజయాన్ని నమోదుచేసింది. దాయాది పాకిస్థాన్‌తో ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా.. 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి బాదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74, 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47, 8 ఫోర్లు) దూకుడుతో భారత్ చేతిలో పాక్‌కు వరుసగా రెండో ఓటమి తప్పలేదు.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. సాహిబ్జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58, 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో ఆ జట్టును ఆదుకున్నాడు. శివమ్ దూబె (2/33), కుల్దీప్ యాదవ్ (1/31) పాక్‌ను కట్టడిచేశారు. ఈ టోర్నీలో భారత్ తమ తదుపరి మ్యాచ్‌ను బుధవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది.
20 ఓవర్లలో 172 పరుగుల లక్ష్యం టీ20లలో మరీ సులువైనదేం కాదు. కానీ అభిషేక్, గిల్ ఒకరిని మించి ఒకరు పాక్ బౌలర్లను వంతులు వేసుకుని మరీ బాదడంతో లక్ష్యం తేలికైపోయింది. షాహీన్ తొలి ఓవర్లో మొదటి బంతికే లెగ్ స్టంప్ మీదుగా సిక్స్ కొట్టిన అభిషేక్ తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. గిల్ కూడా అయూబ్ రెండో ఓవర్లో షార్ట్ ఫైన్, ఎక్స్ట్రా కవర్స్ మీదుగా రెండు బౌండరీలు రాబట్టాడు. ఆ తర్వాత అఫ్రిది ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టాడు. అబ్రార్ 3వ ఓవర్లో అభిషేక్ 4,6 బాదగా అయూబ్ 6వ ఓవర్లో గిల్ మరో రెండు ఫోర్లు సాధించాడు. 7వ ఓవర్లో అబ్రార్‌ను రెండు భారీ సిక్సర్లతో అరుసుకున్న అభిషేక్.. అయూబ్ బౌలింగ్‌లో బౌండరీతో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తిచేశాడు.
ఈ ఇద్దరి దూకుడుతో 8.4 ఓవర్లలోనే భారత్ వంద పరుగుల మైలురాయిని దాటింది. విజయం దిశగా సాఫీగా సాగుతున్న క్రమంలో ఫహీమ్ 9వ ఓవర్లో గిల్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో 105 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. హరీస్ రౌఫ్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో కెప్టెన్ సూర్య డకౌట్ అయ్యాడు. అబ్రార్ 13వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన అభిషేక్.. లాంగాన్ వద్ద రౌఫ్‌కు క్యాచ్ ఇచ్చాడు. 17వ ఓవర్లో శాంసన్ (17)ను రౌఫ్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్‌లో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ తిలక్ వర్మ (19 బంతుల్లో 30*, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్ధిక్ పాండ్యా (7*) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు.
మొదట బ్యాటింగ్ చేసిన పాక్ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే మొదలెట్టింది. బుమ్రా రెండో ఓవర్లో ఫకార్ జమాన్ (15) రెండు బౌండరీలు కొట్టాడు. హార్ధిక్ మూడో ఓవర్లోనూ ఫోర్ కొట్టిన అతడు.. మూడో బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే హార్ధిక్ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ వద్ద అభిషేక్ క్యాచ్ నేలపాలు చేయడంతో బతికిపోయిన ఫర్హాన్ బాదే బాధ్యతను తీసుకున్నాడు.
బుమ్రా వేసిన 4, 5వ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన అతడు.. వరుణ్ 8వ ఓవర్లో సిక్స్ కొట్టాడు. గత మూడు మ్యాచ్‌లలో సున్నాలు చుట్టిన అయూబ్ (21) ఈ మ్యాచ్‌లో మరీ ధాటిగా ఆడకపోయినా ఫర్హాన్‌కు అండగా నిలిచాడు. రెండో వికెట్‌కు ఫర్హాన్‌తో 72 రన్స్ జోడించాడు. అక్షర్ పదో ఓవర్లో మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన ఫర్హాన్ 34 బంతుల్లో అర్ధ శతకాన్ని సాధించాడు.
10 ఓవర్లలో పాక్ స్కోరు 91/1. వాళ్ల జోరు చూస్తే భారీ స్కోరు ఖాయమే అనిపించింది. కానీ దూబె రాకతో పాక్ బ్యాటింగ్ జోరుకు బ్రేక్‌పడింది. చివరి 60 బంతుల్లో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులే చేయగలిగింది. 11వ ఓవర్లో దూబె.. అయూబ్‌ను ఔట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. 14వ ఓవర్లో కుల్దీప్.. తొలి బంతికే హుస్సేన్ తలాత్ (10)ను ఔట్ చేశాడు. మరుసటి ఓవర్లో దూబె.. ఫర్హాన్నూ బోల్తా కొట్టించాడు. కెప్టెన్ సల్మాన్ అఘా (17*), నవాజ్ (21) వేగంగా ఆడలేకపోయారు. ఆఖర్లో ఫహీమ్ అష్రఫ్ (20*) మెరుపులు మెరిపించాడు.