ముంబై : భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి, బౌలర్ హర్షిత్ రాణాకు బంపరాఫర్ దక్కనుంది. ఈ ముగ్గురూ ఈ ఏడాది బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు అందుకోనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక ఏడాదికాలంలో ఒక క్రికెటర్ మూడు టెస్టులు లేదా 8 వన్డేలు లేదా పది టీ20లు ఆడితే వాళ్లు నేరుగా గ్రేడ్- సీ కాంట్రాక్టును అందుకునే అవకాశముంది.
దీని ప్రకారం చూసుకున్నా.. అభిషేక్ ఇప్పటిదాకా 17 టీ20లు ఆడగా అందులో నిరుటి సీజన్లో వరుసగా 12 మ్యాచ్‌లు ఆడాడు. నితీశ్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులలోనూ ఆడి అంచనాలకు మించి రాణించాడు. హర్షిత్ ఈ క్రైటీరియాలో తగిన మ్యాచ్‌లు ఆడకపోయినప్పటికీ అతడికీ కాంట్రాక్టు దక్కనున్నట్టు తెలుస్తున్నది. వీరితో పాటు టీ20లలో తనదైన బౌలింగ్‌తో రాణిస్తున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (4 వన్డేలు, 18 టీ20లు) కూడా బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోనున్నట్టు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవనున్నాయి.