Ind Vs Eng Test | రాజ్‌కోట్ టెస్టుపై భారత్ మరింత పట్టుబిగిస్తున్నది. ఇంగ్లండ్ బజ్‌బాల్ వ్యూహాన్ని అంతే దీటుగా తిప్పికొడుతూ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీతో కదంతొక్కిన వేళ టీమ్ఇండియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్ బౌలింగ్ దాడిని తుత్తునియలు చేస్తూ జైస్వాల్ శతకనాదం పూరించాడు. భారత భవిష్యత్ ఆశాకిరణంలా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ దూసుకెళుతున్నాడు. హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్ నాలుగు వికెట్ల విజృంభణతో ఇంగ్లండ్ బ్యాటింగ్ నడ్డివిరిచాడు. 95 పరుగుల తేడాతో ఆఖరి ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ మంచి అవకాశాన్ని చేజార్చుకుంది.
రాజ్‌కోట్: భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతున్నది. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తూ ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తున్నది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(133 బంతుల్లో 104 రిటైర్డ్ హర్ట్, 9ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో అదరగొట్టగా, గిల్(65 నాటౌట్) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి రాణింపుతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. రజత్ పాటిదార్(0)మరోమారు తీవ్రంగా నిరాశపర్చగా, గిల్, కుల్దీప్యాదవ్(3) క్రీజులో ఉన్నారు. రూట్, హార్ట్లే ఒక్కో వికెట్ తీశారు. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్న భారత్ ప్రస్తుతం 322 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 207/2 మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌటైంది. డకెట్(153) ఒక్కడే రాణించగా, కెప్టెన్ స్టోక్స్(41) ఫర్వాలేదనిపించాడు. సిరాజ్(4/84) ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, కుల్దీప్యాదవ్(2/77), జడేజా(2/51) రెండేసి వికెట్లు తీశారు.
జైస్వాల్ జోరు: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో జైస్వాల్ శతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. విశాఖ టెస్టులో డబుల్ సెంచరీతో కదంతొక్కిన ఈ ముంబైకర్..రాజ్‌కోట్‌లో వీరవిహారం చేశాడు. ఇంగ్లిష్ బౌలింగ్ దాడిని దీటుగా తిప్పికొడుతూ కెరీర్లో ముచ్చటగా మూడో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్‌శర్మ(19) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా..ఆత్మవిశ్వాసం కోల్పోని జైస్వాల్..ఇన్నింగ్స్ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆదిలో కుదురుకునేందుకు సమయం తీసుకున్న జైస్వాల్ ఆ తర్వాత జూలు విదిల్చాడు. ఇంగ్లండ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ మైదానం నలువైపులా ఫోర్లు, సిక్స్‌లతో అభిమానులను అలరించాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన ఏడు టెస్టుల్లోనే మూడో శతకాన్ని తన ఖాతాలో వేసుకుని దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాడు. ఇన్నింగ్స్ ముగుస్తుందన్న తరుణంలో భరించలేని నడుం నొప్పితో జైస్వాల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 155 పరుగుల అజేయ భాగస్వామ్యానికి ఒకింత బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన రజత్ పాటిదార్ పరుగులేమి చేయకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన గిల్..మలి ఇన్నింగ్స్‌లో విలువ చాటుకున్నాడు. జైస్వాల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్‌కు తెరతీశాడు. ఎక్కడా చెత్త షాట్‌కు పోకుండా బాధ్యతాయుతంగా ఆడాడు. కుల్దీప్యాదవ్తో కలిసి గిల్ మూడో రోజు ఆటను ముగించాడు.
సిరాజ్ విజృంభణ:సీనియర్ స్పిన్నర్ అశ్విన్ లేని లోటును భారత బౌలర్లు ఏ మాత్రం కనిపించకుండా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా స్వింగ్‌స్టర్ సిరాజ్..ఇంగ్లండ్ పతనంలో కీలకమయ్యాడు. 224/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్..సిరాజ్ విజృంభణతో 319 పరుగులకు పరిమితమైంది. సెంచరీ హీరో డకెట్‌ను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించగా, మిగతా పనిని జడేజాతో కలిసి సిరాజ్ పూర్తి చేశాడు. రూట్(18)ను మరోమారు బుమ్రా తన ఖాతాలో వేసుకోగా, బెయిర్‌స్టో(0)ను కుల్దీప్ డకౌట్ చేశాడు. సూపర్ యార్కర్లతో సిరాజ్..ఇంగ్లండ్ లోయార్డర్ పనిపట్టాడు. మొత్తంగా 95 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చివరి ఎనిమిది వికెట్లు కోల్పోయి మూడో టెస్టుపై పట్టు కోల్పోయింది. ఆదివారం ఆటలో భారత్‌ను ఎలా నిలువరిస్తుంది అన్న దానిపై ఇంగ్లండ్ విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
అశ్విన్ అమ్మకు అనారోగ్యం
భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తల్లి అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం ఆమె చెన్నైలో చికిత్స తీసుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ‘అశ్విన్ తల్లి త్వరగా కోలుకోవాలని, ఇలాంటి క్లిష్ట సమయంలో అతనికి బోర్డు అన్ని విధాలుగా అండగా ఉంటుంది’ అని బీసీసీఐ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. టెస్టు క్రికెట్లో ఐదు వందల వికెట్ల మైలురాయిని అందుకున్న అశ్విన్ హుటాహుటిన రాజ్‌కోట్ నుంచి చెన్నై బయల్దేరి వెళ్లాడు. కుటుంబంలో హెల్త్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ వెళ్లాల్సి వచ్చిందని బోర్డు ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
నల్ల రిబ్బన్లతో
మూడో టెస్టు మూడో రోజు ఆటలో భారత క్రికెటర్లు నల్లరిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. క్రికెట్ కురువృద్ధుడు దత్తాజీరావు గైక్వాడ్ మృతికి సంతాపంగా క్రికెటర్లు నల్ల రిబ్బన్లు ధరించారు. అయితే ఆట తొలి రోజే చేయాల్సిందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 445 ఆలౌట్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్, భారత్ రెండో ఇన్నింగ్స్: 196/2(జైస్వాల్ 104, గిల్ 65 నాటౌట్, రూట్ 1/48)