IND vs PAK |అంతర్జాతీయ క్రికెట్ అభిమానులలో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ పండగలాంటి ఉత్సాహం కనిపిస్తుంది . కానీ రాబోయే 2028 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్లో ఆ రసవత్తర పోరు చూడటం అసాధ్యం అని అంటున్నారు. ఐసీసీ కొత్తగా రూపొందించిన నియమాల ప్రకారం భారత్–పాక్ మ్యాచ్ (India vs Pakistan) జరుగుతుందో లేదో స్పష్టత లేదు.128 ఏళ్ల విరామం తర్వాత ఒలింపిక్స్లో క్రికెట్ తిరిగి ప్రవేశం పొందుతోంది. 2028 లాస్ఏంజెల్స్ వేదికగా జరిగే ఈ విశ్వక్రీడల్లో క్రికెట్ టీ20 ఫార్మాట్లో నిర్వహించబడనుంది. తాజాగా దుబాయ్లో జరిగిన సమావేశంలో ఐసీసీ ఈ టోర్నీకి సంబంధించిన నిబంధనలకు తుది రూపం ఇచ్చింది. ఇందులో పురుషులు, మహిళలు — రెండింటికీ ఆరేసి జట్లు మాత్రమే పాల్గొననున్నాయి.
ఐసీసీ ప్రకారం, ఒలింపిక్స్ కోసం జట్లు ప్రాంతీయ అర్హత ఆధారంగా ఎంపిక చేయబడతాయి. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా రీజియన్లలో టాప్లో ఉన్న జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశానికి ఒక స్థానం లభిస్తుంది. మిగిలిన ఆరో జట్టు క్వాలిఫయర్ రౌండ్ ద్వారా ఎంపిక చేయబడుతుంది. ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం ఆసియా నుంచి: భారత్, ఓషియానియా నుంచి: ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుంచి: దక్షిణాఫ్రికా, యూరప్ నుంచి: ఇంగ్లాండ్, ఆతిథ్య దేశంగా : అమెరికా స్థానం సంపాదించుకున్నాయి. మిగిలిన ఒక స్థానం గ్లోబల్ క్వాలిఫయర్స్ ద్వారా తేలనుంది. ఒక్కో రీజియన్ నుంచి ఒక్క జట్టే అర్హత పొందేలా ఐసీసీ నిబంధనలు రూపొందించడం వల్ల పాకిస్థాన్ ఒలింపిక్స్ బరిలోకి దిగే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆసియా టీ20 ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానంలో ఉండడంతో ఆసియా ప్రతినిధిగా టీమిండియా అర్హత సాధించే అవకాశం ఎక్కువ.ఇలా చూస్తే, అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్న భారత్–పాక్ పోరు ఒలింపిక్స్లో జరగకపోవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్ చివరిసారిగా 1900లో పారిస్ ఒలింపిక్స్లో చోటు దక్కింది. ఆ టోర్నీలో కేవలం ఒకే మ్యాచ్ జరిగి, బ్రిటన్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత తొలిసారిగా 2028లో ఈ క్రీడ మళ్లీ ఒలింపిక్ వేదికను అలరించబోతోంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో జట్లు బరిలో దిగుతాయి. దీంతో క్రికెట్ అభిమానులకు ఇది మరో చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది . అయితే అందులో భారత్–పాక్ పోరు మిస్ అవుతుందేమో చూడాల్సి ఉంది.