శనివారం 11 జూలై 2020
Sports - May 28, 2020 , 18:24:05

భారత్‌X ఆస్ట్రేలియా: పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించిన సీఏ

భారత్‌X ఆస్ట్రేలియా: పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించిన సీఏ

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో.. ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియా పర్యటిస్తుందా..? వెళితే టెస్టులు మాత్రమే ఆడుతుందా..  అన్న ప్రశ్నలు తలెత్తాయి.  వారాల పాటు కొనసాగిన ఈ సందిగ్ధతకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ముగింపు పలికింది. పర్యటనలో నాలుగు టెస్టులతో పాటు టీ20, వన్డే సిరీస్‌ల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. మూడు టీ20లు, నాలుగు టెస్టులు(బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ), మూడు వన్డేల సిరీస్‌ల తేదీలను గురువారం తన అధికారిక వెబ్‌సైట్‌లో సీఏ వెల్లడించింది. ఆస్ట్రేలియాతో అక్టోబర్‌ 11న బ్రిస్బేన్‌లో జరుగనున్న తొలి టీ20తో కోహ్లీసేన పోరాటాన్ని మొదలుపెట్టనుంది. ఆ తర్వాతి టీ20లు మ్యాచ్‌లు అక్టోబర్‌ 14(కాన్‌బెర్రా), అక్టోబర్‌ 17(అడిలైడ్‌)న జరుగనున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం మూడో టీ20 ముగిసిన మరుసటి రోజే(అక్టోబర్‌) టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే విశ్వటోర్నీ జరిగేది అనుమానమే.

కాగా భారత్‌ - ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ డిసెంబర్‌ 3న బ్రిస్బేన్‌లో ప్రారంభం కానుంది. ఆ తర్వాత అడిలైడ్‌(డిసెంబర్‌ 11-15)లో ఇరు జట్ల మధ్య డై అండ్‌ నైట్‌ టెస్టు పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఆడితే విదేశాల్లో టీమ్‌ఇండియాకు ఇదే తొలి గులాబీ బంతి పోరు కానుంది. మూడు, నాలుగో టెస్టులు మెల్‌బోర్న్‌(డిసెంబర్‌ 26-30), సిడ్నీ(జనవరి 3-7) వేదికగా జరుగనున్నాయి. మరోవైపు మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జనవరి 12న పెర్త్‌లో జరుగనున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో కోహ్లీసేన తలపడనుంది. ఆ తర్వాత చివరి రెండు వన్డేలు మెల్‌బోర్న్‌(జనవరి 15), సిడ్నీ(జనవరి 17) వేదికగా జరుగనున్నాయి. మరోవైపు మూడు వన్డేల సిరీస్‌ కోసం భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుందని సీఏ ప్రకటించింది. కాగా కరోనాతో పోటీలు నిలిచిపోయాక జింబాబ్వే(ఆగస్టు 9-15) పర్యటనతో మళ్లీ క్రికెట్‌ను పునఃప్రారంభించనున్నట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో ఆసీస్‌ టీ20 సిరీస్‌ ఆడనుంది. 

 


logo