e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు ఇంటికి వచ్చి.. ధైర్యం చెప్పి..!

ఇంటికి వచ్చి.. ధైర్యం చెప్పి..!

ఇంటికి వచ్చి.. ధైర్యం చెప్పి..!

కొనసాగుతున్న ఇంటింటా జ్వర సర్వే
సిద్దిపేట జిల్లాలో 666 బృందాలు ఏర్పాటు
సంగారెడ్డిలో 1272, మెదక్‌లో 581 బృందాలతో పక్కాగా సాగుతున్న సర్వే
బాధితులు భయాన్ని వీడేలా కృషి చేస్తున్న బృందాలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు
అవసరమైన వారికి కరోనా కిట్లు అందజేత
నిత్యం మానిటరింగ్‌ చేస్తున్న కలెక్టర్లు

కరోనా ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. వైరస్‌ బారిన పడిన వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఏమైతుందో అని భయానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంటింటికీ వస్తున్న బృందాలు వారికి ధైర్యాన్ని కల్పిస్తున్నాయి. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం ఇతరుల ఇంటికి ఎవరూ పోలేని పరిస్థితులు. ఏ కష్టాన్ని అయినా ఎవరితోనూ ప్రత్యక్షంగా కలిసి చెప్పుకోలేని దుస్థితి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కరోనా బాధితులు మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. కాగా, కొవిడ్‌ నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా సర్వేను ప్రారంభించగా, అది విజయవంతంగా కొనసాగుతున్నది. బృందాలు ఇంటింటినీ తట్టి ప్రజలకు భరోసాను కల్పిస్తున్నాయి. ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసి, లక్షణాలు ఉన్న వారికి కరోనా కిట్‌ ఇస్తున్నాయి. హోం ఐసొలేషన్‌కు ఆదేశిస్తున్నాయి. తీవ్రత ఎక్కువ ఉన్నవారిని దవాఖానల్లో చేర్పించి సాంత్వన కలిగిస్తున్నాయి. కరోనాకు మనోధైర్యమే మందని తెలియజేస్తున్నాయి. సర్వే పకడ్బందీగా సాగుతుండగా, నిత్యం కలెక్టర్లు మానిటరింగ్‌ చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. – సిద్దిపేట కలెక్టరేట్‌, మే 9

‘నాలుగు రోడ్లు వేసి.. నాలుగు చోట్ల రంగులు పూసినంత మాత్రాన నాయకుడు అనిపించుకోడు.. ఆపదలో ప్రజలకు సేవ చేయాలి.. ఆదే మనకు దక్కే గౌరవం, పుణ్యం. కరోనా మహమ్మారి ప్రజలపై విచుకుపడుతున్నది. వాళ్లు ఎన్నో అపోహలు, భయాలతో వణికిపోతున్నారు. ఈ సమయంలో తోడుగా ఉండి ధైర్యం చెప్పండి.. రాష్ట్ర సర్కారు అందించే వసతులు చెప్పి వైద్యం అందేలా చూడండి. కరోనా బాధితులను అవ్వ, అయ్యా, అన్న అంటూ ఆత్మీయంగా పలకరించండి. అదే వారికి కొండంత ధైర్యాన్నిస్తుంది. అధికారులతో కలిసి వెళ్లి ఇంటింటా యోగక్షేమాలను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరీపై ఉంది. బాధితుడి పరిస్థితి దృష్ట్యా సౌకర్యాల విషయంలో ఇబ్బంది ఉంటే కలెక్టర్‌ లేదా మా దృష్టికి తెచ్చి ఆపదలో ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడాలంటూ’ ఇటీవల నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు జిల్లా ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

సిద్దిపేట కలెక్టరేట్‌, మే 9 :
కొవిడ్‌ నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా జ్వర సర్వేను ప్రారంభించగా, అది విజయవంతంగా కొనసాగుతున్నది. కరోనా నియంత్రించడంలో జిల్లాను ఆదర్శంగా నిలపాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. వారం రోజులుగా అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యతలను గుర్తు చేస్తున్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన చికిత్సను అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా లక్షణాలున్న వారికి ప్రభుత్వం నుంచి కొవిడ్‌ కిట్లను అందిస్తున్నారు. సిద్దిపేటలో జిల్లాలో 666 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంటింటా జ్వర సర్వే చేయిస్తున్నారు. ఆపదకాలంలో ప్రజాప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేయిస్తూ, వారికి కొండంత ధైర్యాన్ని నింపుతున్నారు. మరోపక్క ఇంటింటికీ వెళ్లి సిబ్బంది కరోనా కిట్లను అందించడంతో ప్రజలను భరోసా ఏర్పడుతున్నది. జిల్లాలో కొవిడ్‌ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా సరిపడా ఆక్సిజన్‌ నిల్వలను అందుబాటులో ఉంచారు. సిద్దిపేట జిల్లా దవాఖానను పూర్తిస్థాయిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మార్చారు. జిల్లా దవాఖానతో పాటు సిద్దిపేటలోని డాక్టర్‌ జగ్జీవన్‌రామ్‌ భవనాన్ని పూర్తిగా కొవిడ్‌ బాధితుల చికిత్స కోసం వినియోగిస్తున్నారు. కొవిడ్‌ బాధితుల కోసం ఇటీవల కలెక్టర్‌ ప్రత్యేక చొరవతో తాత్కాలికంగా వైద్యసిబ్బందిని నియమించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలతో పాటు సిద్దిపేట పట్టణంలోని సురక్ష ప్రైవేట్‌ దవాఖానలో ఆక్సిజన్‌ నిల్వలను ఉంచి డిమాండ్‌, సరఫరాపై నిత్యం మానిటరింగ్‌ చేస్తున్నారు.

కొండంత ధైర్యం..
సర్వే బృందాలు ఇంటింటిని తట్టి వివరాలు తెలుసుకుండడంతో కరోనా బాధితులకు కొండంత ధైర్యం వస్తున్నది. కరోనా నిర్ధారణ అయిన తర్వాత బాధితుడితో పాటు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యేవారు. ఎన్నో అపోహలు ఉండేవి. దీంతో కరోనా బాధితుడు ధైర్యాన్ని కోల్పోతున్నారు. ప్రసుత్తం బృందాల ద్వారా బాధితులకు ధైర్యాన్ని నింపుతున్నారు. ఏ మందులు ఎలా వేసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేస్తున్నారు. మళ్లీ వారం తర్వాత తామే వస్తామంటూ బాధితులకు బృందాలు భరోసాను కల్గిస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులున్నా ఈ నంబర్లకు ఫోన్‌ చేయండి అంటూ వారిలో ధైర్యాన్ని నూరిపోస్తున్నారు బృందాల సభ్యులు. మొత్తం మీద ఇంటికే వచ్చి మందులు ఇస్తుండడంతో బాధితులు భయాన్ని వీడి ఆత్మైస్థెర్యాన్ని పొందుతున్నారు.

బృందాల లక్ష్యం..
కరోనా వ్యాప్తి నియంత్రణకు బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడడం, వాక్సినేషన్‌ ప్రక్రియ వందశాతం జరిగేలా చర్యలు తీసుకోవడం, బాధితులకు ధైర్యం చెప్పడం, ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటికీ కొవిడ్‌ ఫీవర్‌ సర్వే చేయించి, ప్రభుత్వం మెడిసిన్‌ అందేలా చూడడం, ఆక్సిజన్‌ లెవల్‌ 94శాతం ఉంటే తక్కువగా ఉంటే 108 ద్వారా జిల్లా కేంద్రంలోని ఐసొలేషన్‌ కేంద్రంలో బాధితుడికి వైద్యం చేసేలా చర్యలు తీసుకోవడం, ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల ఆరోగ్య వివరాలను తెలుసుకోవడం బృందాల లక్ష్యం. బృందాల్లో స్థానికంగా సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్‌ఎం, ఆశవర్కర్‌, అంగన్‌వాడీ కార్యకర్త, వీవోలతో కలిసి ప్రత్యేక బృందాలను సిద్దిపేట జిల్లాలో 666 ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 1272, మెదక్‌ జిల్లాలో 581 బృందాలు సర్వే చేస్తున్నాయి.

పకడ్బందీగా ప్రక్రియ..
ఇంటింటా జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నిత్యం వివరాలను కలెక్టర్లకు అందజేస్తున్నారు. సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ప్రజాప్రతినిధి, అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్లు హెచ్చరించారు. దీంతో అన్నిచోట్ల సర్వే పక్కాగా జరుగుతున్నది. ప్రతి కుటుంబంలోని అందరి ఆరోగ్య సమాచారం సేకరిస్తున్నారు. జ్వరం, ఇతర జబ్బులతో బాధపడితే వైద్యం, అవసరం ఉన్న వారికి కరోనా కిట్లను అందిస్తున్నారు. 45 ఏండ్లు పైబడిన వారందరూ వ్యాక్సిన్‌ వేసుకునే విధంగా వారిలో చైతన్యం తీసుకువస్తున్నారు. సర్వేను మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. నిత్యం సాయంత్రం పురోగతిని కలెక్టర్లు మానటరింగ్‌ చేస్తున్నారు. మరుసటి రోజు టెలీకాన్ఫరెన్‌లను నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంటికి వచ్చి.. ధైర్యం చెప్పి..!

ట్రెండింగ్‌

Advertisement