శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 18, 2020 , 00:16:37

ఉప్పొంగంగ

ఉప్పొంగంగ

  • ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎడతెరపిలేని వర్షం
  • n పరవళ్లు తొక్కుతున్న తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌, శనిగరం ప్రాజెక్టు
  • n సిద్దిపేట జిల్లాలో తగ్గని వాగుల ఉధృతి
  • n దశాబ్దాల తర్వాత అలుగు పారుతున్న పలు చెరువులు 
  • n వరుసగా ఐదు రోజూ కురిసిన వాన 
  • n కూలుతున్న పాత ఇండ్లు.. పంట చేలను ముంచెత్తిన వాననీరు 
  • n సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు
  • n పంట నష్టం, ఇండ్లు కూలిన వారి వివరాలు సేకరిస్తున్న అధికారులు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ : సిద్దిపేట జిల్లాలో వరుసగా ఐదోరోజూ వర్షం కురిసింది. వాగుల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది. జిల్లాలోని తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, మోయతుమ్మెద, పెద్దవాగు, కూడవెల్లి వాగు,సిద్దిపేట వాగులు ఐదు రోజులుగా పొంగి పొర్లుతున్నాయి. సిద్దిపేట కోమటి చెరువుతో పాటు జిల్లాలోని పలు చెరువులు అలుగులు పారుతున్నాయి. చెరువులు, చెక్‌డ్యామ్‌లు జలకళను సంతరించుకున్నాయి. బోరు, బావుల్లో నీరు పైపైకి ఉబికి వస్తున్నది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న  వర్షాలకు దశాబ్దాల కాలం తర్వాత అనేక చెరువులు అలుగు పారుతున్నాయి. కొన్నిచోట్ల చిన్న కుంటలు తెగిపోయాయి. వాగుల్లో వరద ఉధృతంగా పారుతుండడంతో చాలాచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల్లో వరద ఉధృతికి పలుచోట్ల గ్రామస్తులు రాకపోకలు కొనసాగించకుండా అడ్డంగా కంచెలు వేశారు. వర్షానికి పత్తి, వరి చేల్లకు నీళ్లు చేరాయి. పంటలు దెబ్బతింటున్నాయని  రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పరిస్థితులపై రాష్ట్ర ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులతో సమీక్షిస్తున్నారు. మంత్రి ఆదేశాలతో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులకు తుగు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. వర్షాలకు పలు గ్రామాల్లో కూలిపోయిన ఇండ్లు, దెబ్బతిన్న పంటల వివరాలను క్షేత్రస్థాయిలో అధికారులు సేకరిస్తున్నారు. ఎప్పటి కప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్‌ నివేదిస్తున్నారు. 

తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌, ..  శనిగరం ప్రాజెక్టు పరవళ్లు..

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని  తోటపల్లి ఆన్‌లైన్‌ రిజర్వాయర్‌ పొంగిపొర్లుతున్నది. గత మార్చిలో మిడ్‌ మానేరు నుంచి గోదావరి జలాలు వచ్చి చేరాయి. గోదావరి జలాలకు తోడుగా ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్‌ పొంగిపొర్లుతుండడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని కింద 50వేల ఆయకట్టు ఉంది. ఈ రిజర్వాయర్‌ నుంచి హుస్నాబాద్‌ నియోజకవర్గంలోని గౌరవెల్లి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తారు. ఆ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. కోహెడ మండలంలోని శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతున్నది. ఐదు రోజులుగా మోయతుమ్మెద వాగు, సిద్దిపేట వాగు పొంగిపొర్లుతుండడంతో శనిగరం చెరువు నిండింది. శనిగరం చెరువు కింద సుమారుగా 5,500 ఎకరాల ఆయకట్టు ఉంది. గతేడాది ఈ చెరువు సుందరీకరణ పనులకు ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో పనులు పూర్తిచేశారు. ఇప్పటికే చెరువు కింద రైతులు నాట్లు వేశారు. ఇక పంటలకు ఢోకా ఉండదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు..

సిద్దిపేట జిల్లాలోని మోయతుమ్మెద, పెద్దవాగు, సిద్దిపేట వాగు, కూడవెల్లి, కుడ్లేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మోయతుమ్మెద వాగు కొండపాక మండలంలో పుట్టి, చేర్యాల, మద్దూరు, నంగునూరు మండలాల మీదుగా ప్రవహిస్తుంది. ఇక్కడి వరకు దీనిని పెద్ద వాగు అని పిలుస్తారు.అక్కడి నుంచి  కోహెడ మండలం బస్వాపూర్‌ల మీదుగా శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, గుండ్ల పల్లి మీదుగా కరీంనగర్‌ లోయర్‌ మానేరు డ్యాంలోకి నీళ్లు వెళ్తాయి. దీనినే మోయతుమ్మెద వాగు అని పిలుస్తారు.ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేలా ఎక్కడికక్కడ చెక్‌డ్యామ్‌లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. సిద్దిపేట, హుస్నాబాద్‌, జనగామ నియోజకవర్గం పరిధిలోని పెద్దవాగు, మోయతుమ్మెద వాగులపై 25 చెక్‌డ్యాంలు, సిద్దిపేట వాగుపై 28, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల మీదుగా వెళ్తున్న కుడ్లేరు వాగుపై 38, హల్ది వాగుపై 10 చెక్‌డ్యాంలు నిర్మించారు. నక్కవాగుపై 7, ఎల్లమ్మవాగుపై 4, చిన్న వాగుపై 5, కోనేటి వాగుపై 3 చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. ప్రస్తుతం అన్ని చెక్‌డ్యామ్‌లు మత్తడి దుంకుతున్నాయి. భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. దీంతో బోరుబావుల నుంచి నీరు పైపైకి ఉబికి వస్తున్నాయి. 


logo