Impact Player | “ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ నాకు నచ్చలేదు. నేను దీనికి పెద్ద అభిమానిని కాను. కొంతమందికి వినోదాన్ని అందించడం కోసం ఇలా చేయడం సరికాదు. ఈ నిబంధన భారత ఆల్‌రౌండర్ల ఎదుగుదలకు తీవ్ర నష్టం చేకూరుస్తోంది. క్రికెట్ అనేది 11 మందితో ఆడాలి గానీ 12 మందితో కాదు” అంటూ టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2023లో ప్రయోగాత్మకంగా పరిచయం చేసిన ఈ నిబంధనను గతేడాదే ఐపీఎల్‌లోనూ తీసుకొచ్చారు. దీని ప్రకారం ప్రతి జట్టూ మ్యాచ్‌కు ముందు ఐదుగురు ‘ఇంపాక్ట్ సబ్’లను ప్రకటించి వారిలో ఒకరిని మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా తుదిజట్టులో ఉండే ఆటగాళ్ల స్థానంలో ఆడించొచ్చు. దీని వల్ల ఐపీఎల్ జట్లు తమ అవసరానికి తగ్గట్టుగా ఆటగాళ్లను వాడుకుంటున్నాయి.
ఈ రూల్‌తో క్రికెట్లోని ప్రాథమిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్నారనేది దీనిపై స్పందిస్తున్న వారి వాదన. ‘ఇంపాక్ట్’ రూల్ వల్ల 12 మందిని ఆడిస్తున్నారనేది ప్రధానమైన విమర్శ కాగా దూబే, వాషింగ్టన్ వంటి ఆల్రౌండర్లను సక్రమంగా వినియోగించుకోవడం లేదనేది ప్రధాన ఆందోళనగా ఉంది. ఉదాహరణకు దూబే స్వతహాగా ఆల్‌రౌండర్ అయినా చెన్నై అతడిని ప్యూర్ బ్యాటర్‌గానే వాడుకుంటోంది. రాజస్థాన్ చాహల్‌తో బౌలింగ్ చేయించి బట్లర్‌ను బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ సబ్‌గా వాడుతోంది. ముంబై సూర్యకుమార్నూ ఇలాగే వాడుకుంటోంది. కొన్ని జట్లు తొలుత బ్యాటింగ్ చేస్తూ త్వరగా కుప్పకూలితే అప్పటికే బ్యాటింగ్ చేసి ఔట్ అయిన ప్లేయర్ స్థానంలో వచ్చిన ఇంపాక్ట్ సబ్ తోనూ బ్యాటింగ్ చేయిస్తున్నాయి. గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు పలు జట్లు ఈ విధానాన్ని పాటించడం విమర్శల పాలైంది. దీనివల్ల 11 మంది కాకుండా 12 మంది బ్యాటింగ్‌కు వచ్చినట్టు అవుతుంది.
రోహిత్‌తో పాటు మరికొంతమంది క్రికెటర్లూ ఈ నిబంధనపై బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, బౌలర్ ముకేశ్ కుమార్, డేవిడ్ వార్నర్, గుజరాత్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ రోహిత్ మాదిరిగానే వ్యాఖ్యానించడం ఈ చర్చకు మరింత ఊతమిచ్చినైట్టెంది. ‘ఆల్‌రౌండర్ అవడం వల్ల ఈ రూల్ నాకు నచ్చలేదు. ప్యూర్ బ్యాటర్, బౌలర్లకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇదే విషయాన్ని నేను మా టీమ్ మీటింగ్‌లో కూడా ప్రస్తావించాను. ఈ నిబంధన వల్ల నేను బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి రావాల్సి వస్తోంది’ అని అక్షర్ అన్నాడు. ముకేశ్ మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ క్రికెట్లో 12 మందితో ఆడరుగా.. మరి ఐపీఎల్లో మాత్రం ఎందుకు ఆడాలి..? ఈ రూల్ ఉండటం వల్ల జట్లు 5, 6 వికెట్లు పడ్డా ఇంపాక్ట్ ప్లేయర్‌ను వాడుకుంటూ ప్రయోజనం పొందుతున్నాయి. అలాకాకుండా ఉండాలంటే పిచ్‌లను అయినా మార్చాలి (బౌలింగ్‌కు అనుకూలంగా ఉండేలా) లేదంటే ఈ నిబంధనను అయినా తొలగించాలి’ అని కుండబద్దలు కొట్టాడు. ‘ఈ రూల్ వల్ల జట్లు ఆరుగురు బౌలర్లు, 8 మంది బ్యాటర్లతో బరిలోకి దిగుతున్నట్టుగా ఉంది. ఆల్‌రౌండర్ల పాత్రను ఇది తగ్గిస్తోంది’ అంటూ మిల్లర్ అభిప్రాయపడ్డాడు. ‘ఈ రూల్ వల్ల టీ20 క్రికెట్లో ఆల్‌రౌండర్లు కనుమరుగవుతారు’ అని వార్నర్ వ్యాఖ్యానించాడు.
ఇంపాక్ట్ రూల్‌తో ఆల్రౌండర్లకు వచ్చిన నష్టమేమీ లేదనేవాళ్లూ ఉన్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘ఇది ఆల్రౌండర్లపై ప్రభావం చూపుతుందన్న వాదనలో కొంత నిజమున్నది’అని అన్నాడు. బోర్డు నిర్ణయంపై ఆసక్తి నెలకొన్నది.