గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 09, 2020 , 23:29:20

కరోనా బాధితుల్లో ఆత్మస్థెర్యాన్ని నింపాలి

కరోనా బాధితుల్లో ఆత్మస్థెర్యాన్ని నింపాలి

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత లేదు. ప్రతిరోజు పీహెచ్‌సీల్లో కొవిడ్‌-19 టెస్టులు చేయాలి. ప్రాథమిక దశలోనే కరోనాను గుర్తించక పోవడంతోనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఏమా త్రం నిర్లక్ష్యం వహించవద్దు. బాధితుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపడానికి కృషిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌ కమిషనర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో ఆదివారం మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొవిడ్‌-19పై జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులపై ఉన్నదని మంత్రి అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని వసతులు ఉండగా, కరోనా బాధితులు ప్రైవేట్‌ దవాఖానలకు వెళ్లి అప్పులు పాలు కాకుండా చూడాలన్నారు. అన్ని పీహెచ్‌సీల్లో రోజువారీగా కరోనా పరీక్షలు నిర్వహించాలని, లేని క్రమంలో చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. 

పీపీఈ కిట్లు, మందులు సిద్ధం...

కరోనా బాధితులకు వైద్యం అందించడం విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం అన్ని దవాఖానల్లో అవసరమైన పీపీఈ కిట్లు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లు, హోం క్వారంటైన్‌ కిట్లు తెప్పించాం. దేనికి కొరత లేదని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కిట్లు లేవని ఎవరూ సాకులు చెప్పొద్దన్నారు. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహించాలని, పరీక్షలు నిర్వహించని క్రమంలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రాథమిక దశలోనే కరోనాను గుర్తించక పోవడంతోనే మరణాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించ వద్దన్నారు. కరోనా బాధితులను గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోవడం సరికాదని, ఈ విషయంలో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులదే అన్నారు. కరోనాకు ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలపై ప్రతి గ్రామంలో తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వ దవాఖానల్లో ఎలాంటి చికిత్స అందిస్తున్నారో, అదే చికిత్స ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా అందుతున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్‌కు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకుని ఎవరూ అప్పులపాలు కావద్దన్నారు. కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది రక్షణ మాది. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. కరోనా పాజిటివ్‌ కేసు ఒక్కటి వచ్చినా, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ అందరికీ కరోనా టెస్టు చేయాలన్నారు. కరోనా బారిన పడిన వారితో ప్రతిరోజు వైద్యులు, ఏఎన్‌ఎంలు మాట్లాడాలని మంత్రి సూచించారు. కరోనా రాకుండా రోజు వేడినీళ్లు తాగాలి, ఆవిరి పట్టాలి, మాస్కులు ధరించాలని జిల్లా ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉన్న వారు ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించి, వైద్యసేవలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లాలోని ప్రజాప్రతినిధులు అందరూ ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.logo