కోనరావుపేట ( సిరిసిల్లా) : కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు. చేతగాని ప్రభుత్వం వల్ల ఇద్దరు చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ (Vinod Kumar ) ను గెలిపించాలని కోరుతూ నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు.
మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం సంవత్సరంలో కుప్పకూలడం ఖాయమని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. రెండు లక్షల రుణమాఫీ, పేదల వివాహాలకు తులం బంగారం, రైతులకు 24 గంటల కరెంట్, ఆరుగ్యారెంటీలు (Six guarantees) ఎక్కడా అమలు కావడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు అరచేతులో వైకుంఠం చూపించారని ఆరోపించారు. వందరోజుల్లో ఇచ్చిన అమలు చేయక భార్య పిల్లలు, దేవుళ్లపై ఒట్టు పెడుతున్నాడని విమర్శించారు.
కేంద్రంలో ఉన్న మోదీ, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి( Revanth Reddy) ఇద్దరు బడే భాయి, చోటే భాయిలని అభివర్ణించారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏనాడు కొనరావు పేట రాలేదని, నియోజకవర్గ సమసయ్యలపై పార్ల మెంట్లో ప్రశ్నించలేదని పేర్కొన్నారు. తాము ఎన్నడూ కూడా దేవుడిని అడ్డం పెట్టు కొని రాజకీయం చేయలేదు . కేసీఆర్ నాయకత్వం లో యాదగిరి లక్ష్మినరసింహ స్వామి ఆలయం నిర్మించామని వెల్లడించారు. దేవుడి పేరుతో పిల్లల మనుసులు పాడు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఐదేండ్లలో అమిత్ షా చెప్పులు మోయడం తప్పా రాజన్న గుడికి, కొండగ్గటు ఆలయానికి ఒక్క రూపాయి తేలేదని అన్నారు.