KCR | పదేండ్ల బీజేపీ పాలనలో ఏ వర్గానికి అయినా న్యాయం జరిగిందా అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. సూర్యాపేట రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా, సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ వంటి పెద్ద పెద్ద నినాదాలు ఇచ్చారు.. వాటి వల్ల ఏమైనా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. వాటిని భర్తీ చేయడానికి మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
భేటీ బచావో – బేటీ పడావో అని నినాదమిచ్చారు.. మరి ఒక్క బేటీని అయినా బచాయించారా? ఒక్క బేటీ అయినా పడాయించారా? అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దళిత, పేద మహిళలపై దాడులే జరుగుతున్నాయని అన్నారు. దేశ చరిత్రలో ఏనాడు కూడా పడిపోని విధంగా రూపాయి విలువ రూ.83కి పడిపోయిందని తెలిపారు. అంతర్జాతీయంగా ఇదీ భారతదేశ గౌరవం.. ఇది బీజేపీ పరిపాలన ఫలితమని అన్నారు.
ఒక పార్టీ ఏమో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుద్ది.. ఇంకో పార్టీ ఏమో ఏ ఊరికి వెళ్తే ఆ ఊరి దేవుడి మీద ఒట్లు పెట్టుకుంటుందని కేసీఆర్ విమర్శించారు. ఒకడేమో ఓట్లు.. ఒకడేమో ఒట్లు ఇదే రాష్ట్రంలో జరుగుతుందని విమర్శించారు. అద్భుతమైన యాదాద్రి దేవాలయాన్ని నిర్మించుకున్నాం.. కానీ ఏనాడైనా దాన్ని ఓట్ల కోసం వాడుకున్నామా? అని ప్రశ్నించారు. ఒకడొచ్చి బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్ అని కొంతమంది అంటున్నారని.. కానీ భువనగిరిలో ఏం జరిగిందని గుర్తుచేశారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మిలాఖత్ అయిపోయి.. బీఆర్ఎస్ చైర్మన్‌ను దించేశారని అప్పుడు కాంగ్రెస్ నుంచి చైర్మన్, బీజేపీ నుంచి వైఎస్ చైర్మన్ అయ్యారని చెప్పారు. మరి ఎవరికి ఎవరు బీ టీమ్ అని ప్రశ్నించారు.
ఇవాళ మోదీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ పడిపోయింది.. మహిళలకు రక్షణ లేదు.. పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుంది.. ఇలా అనేక సమస్యలు ఉంటే, అదేమీ లేదన్నట్టుగా.. అక్షింతలు కలపాలి, తీర్థం పుచ్చుకోవాలి, ప్రసాదం తినాలి, ఊరేగింపులు తీయాలి అన్నట్టుగా బీజేపీ తీరు ఉందని విమర్శించారు. ఈ అక్షింతలు, ఈ పులిహోర, ఈ తీర్థాలు, కాషాయ జెండాల ఊరేగింపులు మన కడుపు నింపుతుందా? అని ప్రశ్నించారు. మన పొలాలకు నీళ్లను తీసుకొస్తుందా అని నిలదీశారు.
ప్రతి బోర్‌కు మీటర్ పెట్టాలని.. లేదంటే నిన్ను పడగొడతా, నీ ఎమ్మెల్యేలను కొంటా అన్నట్టుగా మోదీ ప్రభుత్వం వ్యవహరించిందని కేసీఆర్ గుర్తు చేశారు. నా తలకాయ తెగిబడ్డాసరే రాష్ట్ర ప్రజలకు కరెంటు కావాలి? మీటర్ పెట్టనని స్పష్టం చేశానని చెప్పారు. ‘ ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఏమంటారు.. మేం రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పినా కూడా మాకే ఓటేసిండ్రు.. అందుకే తెల్లారి నుంచే మీటర్లు పెడతారు’ అని కేసీఆర్ అన్నారు. అందుకే రైతులు ఆలోచించుకోవాలని సూచించారు.
మోదీ వచ్చి రాగానే ఏడు మండలాలను తీసుకెళ్లి ఏపీకి ఇచ్చేశారని కేసీఆర్ తెలిపారు. 400 మెగావాట్ల సీలేరు ప్రాజెక్టును తీసుకెళ్లి ఆంధ్రాకు అప్పజెప్పారని మండిపడ్డారు. మోదీ లేకుండా, బీజేపీ లేకుండా ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణకు బ్రహ్మాండంగా లాభం జరిగేదని అన్నారు. తెలంగాణ భారీగా నష్టపడ్డదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల అని వ్యాఖ్యానించారు. మళ్లీ సిగ్గులేకుండా ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. ఆనాడు తప్పిపోయి ఓటేస్తే నలుగురు ఎంపీలుగా గెలిచారు. వీళ్లు ఒక్క రూపాయి పనైనా చేశారా? ఇప్పుడు గెలిపిస్తే ఏం చేస్తారని విమర్శించారు. ‘ మా వయసు మీరిపోతుంది.. ఈ తెలంగాణ మీది.. భవిష్యత్తు మీది.. ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపేది మీరు.. పార్లమెంటులో ఏం జరుగుతుంది? ఎవరు గెలిస్తే మనకు మేలు జరుగుతుందనేది యువకులు ఆలోచించాలని’ చెప్పారు.