Pawan Fans | స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మంచి ఫాంలో లేరనే చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఆయన చివరిసారిగా తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఆయనపై తరచూ ట్రోలింగ్ జరుగుతోంది. అయినప్పటికీ ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానుల్లో ఆసక్తి కొనసాగుతోంది. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయని చెప్పలేం. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులకు ఓ మోస్తరుగా అనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ట్రైలర్‌లోని కొన్ని డైలాగులపై సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ కూడా వచ్చాయి. ‘ఈ సినిమాను కాపాడేది పవనే’ అన్న కామెంట్లు కూడా వినిపించాయి.
అయితే ఈ విమర్శలను పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో హరీష్ శంకర్‌పై వచ్చే నెగటివ్ కామెంట్లకు వారు గట్టిగా కౌంటర్ ఇస్తూ దర్శకుడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక రీమేక్ అనే ప్రచారం మొదలైన సమయంలో పవన్ ఫ్యాన్స్‌లో కొంత అసంతృప్తి కనిపించింది. అప్పట్లో హరీష్ శంకర్‌పై విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. సినిమా విడుదలకు దగ్గరపడుతున్న వేళ అభిమానులు దర్శకుడికి పూర్తి మద్దతు ఇస్తున్నారు. దానికి ప్రధాన కారణం హరీష్ శంకర్‌కు పవన్ అభిమానుల్లో ఉన్న ప్రత్యేక స్థానం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌కు వరుస విజయాలు లేని సమయంలో ‘గబ్బర్ సింగ్’ వంటి భారీ హిట్ ఇచ్చిన ఘనత హరీష్ శంకర్‌దే. ఆ సినిమాతో పవన్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అచ్చం అలానే చూపించాడని ఇప్పటికీ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటారు.
అంతేకాదు, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం హరీష్ శంకర్ ఎన్నేళ్లుగా ఎదురుచూశాడన్న విషయం కూడా అభిమానులకు తెలిసిందే. సుమారు ఐదేళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో ఆలస్యమైంది. మధ్యలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా కోసం కొంత సమయం వెచ్చించినా, మిగతా కాలం మొత్తం పవన్ సినిమా కోసం వేచి చూశారు. మొదటగా అనుకున్న ‘తెరి’ రీమేక్‌పై అభిమానుల్లో వ్యతిరేకత రావడంతో దానిని పక్కనపెట్టి కొత్త కథను సిద్ధం చేసినట్లు కూడా సమాచారం. పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్‌కు అందుబాటులోకి వచ్చిన తర్వాత హరీష్ శంకర్ వేగంగా పని చేసి తక్కువ రోజుల్లోనే సినిమాను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. సినిమా ఫలితం ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే, పవన్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను తెరకెక్కించాడనే నమ్మకం ఫ్యాన్స్‌లో కనిపిస్తోంది. అందుకే గతంలో విమర్శలు చేసినప్పటికీ విడుదలకు ముందు మాత్రం దర్శకుడికి పూర్తి మద్దతు ఇస్తూ సినిమాను విజయవంతం చేయడానికి పవన్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు.