శుక్రవారం 07 ఆగస్టు 2020
Science-technology - Jul 12, 2020 , 19:40:10

టిక్‌టాక్‌పై అమెజాన్‌ నిషేధం.. వెంటనే నిర్ణయం వెనక్కి!

టిక్‌టాక్‌పై అమెజాన్‌ నిషేధం.. వెంటనే నిర్ణయం వెనక్కి!

వాషింగ్టన్‌: టిక్‌టాక్‌పై భారత్‌ నిషేధం విధించగానే, అమెరికా సహా పలు దేశాలూ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ప్రఖ్యాత సంస్థ అమెజాన్‌ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. సంస్థకు చెందిన ఉద్యోగులు తమ ఫోన్లనో టిక్‌టాక్‌ యాప్‌ను తీసేయాలని ఈమెయిల్‌ ద్వారా సందేశం పంపింది. ఏం జరిగిందో ఏమో కొద్దిసేపట్లోనే నిర్ణయం మార్చుకుంది. ఆ ఈమెయిల్‌ టెక్నికల్‌ ఎర్రర్‌ వల్ల వచ్చిందంటూ మరొక సందేశం పంపింది. టిక్‌టాక్ నిషేధంపై ప్ర‌స్తుతం త‌మ‌కు ఎలాంటి విధానాలు లేవ‌ని స్పష్టం చేసింది. అయితే, దీనిపై మాట్లాడేందుకు అమెజాన్‌ డాట్‌కామ్‌ ప్రతినిధి జాకీ అండర్సన్‌ నిరాకరించారు. 

అమెజాన్‌ ఉద్యోగవర్గాల సమాచారం ప్ర‌కారం.. టిక్‌టాక్ యాప్‌ను ఫోన్లనుంచి తొలగించాలని ఉద్యోగుల‌కు మొయిల్ పంపగా, ఆ విష‌యం టిక్‌టాక్ ప్ర‌తినిధికి చేరింది. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన ఆయ‌న అమెజాన్ ప్ర‌తినిధి జాకీ అండ‌ర్స‌న్‌తో ఈ విషయంపై చర్చించారు. ఆ వెంటనే టిక్‌టాక్ నిషేధంపై అమెజాన్ వెన‌క్కి త‌గ్గిన‌ట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, టిక్‌టాక్‌ నిషేధంపై అగ్రరాజ్యం అమెరికాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌ డాన్స్‌ సమూలమైన సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. చైనా వెలుపల ప్రత్యేక ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు టిక్‌టాక్‌ ప్రతినిధులు సన్నద్ధమైనట్లు సమాచారం. టిక్‌టాక్‌ ప్రధాన కార్యాలయ వ్యవహారాలను చైనా రాజధాని బీజింగ్‌ నుంచి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే, అమెరికాతో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు చైనాకు చెందిన టిక్‌టాక్‌ మాజీ చీఫ్‌ అలెక్స్‌ జూ, లాస్‌ ఏంజిల్స్‌ కేంద్రంగా పనిచేసే కొత్త సీఈవో కెవిన్‌ మేయర్‌కి బాధ్యతలను అప్పగించారు.లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo