Kidney Transplant | న్యూయార్క్, ఆగస్టు 16: మానవ శరీరంలో ప్రతి అవయవానికి ప్రత్యేకత ఉంది. నిర్దిష్టమైన పనులను చేస్తూ జీవక్రియలు సజావుగా సాగేందుకు అవి దోహదం చేస్తున్నాయి. అయితే వాటిలో ఏదైనా అవయవం పాడైపోతే మానవుడి పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. వెంటనే పాడైపోయిన అవయవాన్ని మార్చాల్సి ఉంటుంది. సమయానికి అవయవ మార్పిడికి నోచుకోక ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు. ఎంతో మంది ఏండ్లుగా అవయవ దాతల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటివారికి న్యూయార్క్ పరిశోధకులు శుభవార్త చెప్పారు. జంతువుల అవయవాలతో మానవులకు జీవం పోయవచ్చని వెల్లడించారు. జన్యు మార్పిడి చేసిన జంతువు కిడ్నీని బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తికి మార్పిడి చేసి విజయవంతంగా పరీక్షించినట్టు వారు తెలిపారు. నెల రోజులకుపైగా కిడ్నీ విజయవంతంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని లాంగోన్స్ ట్రాన్స్‌ప్లాంట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా.రాబర్ట్ మోంట్గోమోరి ఆధ్వర్యంలో పరిశోధనలు జరిపారు.
అమెరికాలో ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్ కాగా కుటుంబ సభ్యులు అనుమతితో అతని శరీరంపై పరిశోధనలు చేశారు. పంది కిడ్నీని సేకరించి దాని జన్యువుల్లో మార్పులు చేసి అతని ఒక కిడ్నీ స్థానంలో ప్రవేశపెట్టారు. వెంటనే అది పని చేయడం ప్రారంభించింది. మూత్రాన్ని ఉత్పత్తి చేయడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇప్పటికీ కిడ్నీ పనిచేస్తున్నదని పరిశోధనలకు నాయకత్వ వహించిన ప్రొఫెసర్ రాబర్ట్ మోంట్గోమోరి తెలిపారు.
స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వలంటీర్లపై ప్రయోగాలు చేసేందుకు అనుమతులు ఇచ్చే అంశంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆలోచిస్తున్నది. ఎఫ్‌డీఏ అనుమతులు లభిస్తే పరిశోధనలు మరింత ఊపందుకోనున్నాయి.