న్యూఢిల్లీ : రాబోయే ఐదేండ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో మానవాళికి పెను విధ్వంసం తప్పదని దిగ్గజ టెకీలు హెచ్చరిస్తుండగా ఏఐ గాడ్ ఫాదర్లలో ఒకరైన మెటా ఏఐ సైంటిస్ట్ (AI Tools) నూతన టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో మానవ మేథను ఏఐ అధిగమించలేదని మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లికన్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మానవ మేథస్సును కృత్రిమ మేథ అధిగమించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఏఐతో పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఇప్పట్లో లేదని, న్యూ టెక్నాలజీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ఏఐ గాడ్ఫాదర్లుగా పేరొందిన ముగ్గురు టెకీల్లో ఒకరిగా లికన్ పేరొందారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వారి కృషికి గాను లికన్తో పాటు జాఫ్రీ హింటన్, యషువా బింగియో టురింగ్ అవార్డును గెలుచుకున్నారు. వీరి న్యూరల్ నెట్వర్క్ ఆధారంగానే చాట్‌జీపీటీ, బింగ్, బార్డ్ చాట్‌బాట్స్ పనిచేస్తాయని చెబుతున్నారు. ఇక ఓ కార్యక్రమంలో లికన్ మాట్లాడుతూ ఏఐ పర్యవసానాలపై కీలక వ్యాఖ్యలుచేశారు.
భవిష్యత్‌లో మానవ మేథను ఏఐ అధిగమించలేదని, ఈ స్ధాయికి చేరేందుకు న్యూ టెక్నాలజీకి చాలా ఏండ్లు, కొన్ని దశాబ్ధాలు పడుతుందని వ్యాఖ్యానించారు. AGI (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్) తో శాస్త్రవేత్తలు నిమిషాల్లో ప్రపంచాన్ని స్వాధీనం చేసుకునే సూపర్-ఇంటెలిజెంట్ సిస్టమ్‌ను ఆన్ చేయగలరనే భయాలున్నాయని, ఇది హాస్యాస్పదం అని కొట్టిపారేశారు. ఏఐ ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకుంటుందనే భయాలను ప్రస్తావిస్తూ ఇది జరిగే పని కాదని, ఇది కేవలం యంత్రాలపై మానవ సహజ స్వభావంతో కూడిన అంచనా మాత్రమే అని ఏఐ సైంటిస్ట్ లికన్ తోసిపుచ్చారు.
Read More :
Google | గూగుల్ ఆవిష్కరణల వెనక భారత్