Artificial Intelligence | అదొక చిన్నపాటి సంస్థ. బొటాబొటి లాభాలు. ఆ కాస్త రాబడి కోసమే ఆశగా ఎదురుచూసే భాగస్వాములు. ఇద్దరు ఉద్యోగుల్ని తీసేస్తే నెలకో అరవై వేలు మిగుల్తాయి. ఆర్థికంగా కొంత వెసులుబాటూ లభిస్తుంది. కానీ వాళ్లంత నిబద్ధతగా పనిచేసే సిబ్బంది దొరుకుతారా? ట్రైనీలతో బండి నడిపించొచ్చా? ఇలాంటి ఆలోచనలో ఉండగా మేనేజరు చేతికి ఓ బ్రహ్మాస్త్రం చిక్కింది. ఆ సంస్థ కంటెంట్ అవసరాలన్నీ తీర్చేయగల ఓ సాఫ్ట్వేర్ చేతికొచ్చింది. నెలకు పదిహేను వందలు పెడితే చాలు, మెయిల్ నుంచి బ్లాగ్ వరకు .. సోషల్ మీడియాకు అవసరమైన రాతలన్నీ క్షణాల్లో వండి వారుస్తుంది. పైపైన చూసుకుని, సరిచేసుకుంటే చాలు. ఆ ఇద్దరు సీనియర్ల కంటే ఇదే మేలేమో అనిపించేంత పక్కాగా పనిచేస్తుందా సాఫ్ట్వేర్. ఇక క్షణం కూడా ఆలోచించలేదు. ఆ నమ్మకస్తులను సాయంత్రానికంతా ఇంటికి పంపారు. ఈ సంఘటన కల్పితం కాదు. ఇప్పటివరకూ కృత్రిమమేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ)ను మనుషులకు అసాధ్యమైన పనులకే వాడేవారు. అందులోనూ ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా. నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి. కానీ ఇప్పుడలా కాదు. ఏసీ, కారు లగ్జరీ స్థాయి నుంచి నిత్యావసరంగా మారిపోయినట్టు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కూడా దినచర్యలో భాగమైపోయింది. కానీ, వ్యవహారం ఇక్కడితో ఆగిపోలేదు. ముందుంది ‘కృత్రిమ’ పండుగ.
మనిషి.. బుద్ధిజీవి. ఆలోచనాపరుడు. లెక్కల్లో పక్కా. అందులోనే కొంత తిక్క కూడా ఉంటుంది.
Artificial Intelligence
లేకపోతే.. ఎవరైనా తనకంటే మెరుగ్గా, తనకంటే వేగంగా, తనకంటే కచ్చితంగా, తనకంటే తెలివిగా పని చేయగల సాంకేతికత కోసం ఆరాటపడతారా? మోహినీ భస్మాసుర కథ తెలిసిన తర్వాత కూడా.. ఇలాంటి కతలుపడతాడా? మేధోపరంగా తనతో సరిసమానంగా పని చేయగల యంత్రాల ఆవిష్కరణ గురించి మనిషి అనాదిగా ఆలోచిస్తూనే వచ్చాడు. విజ్ఞానం పెరిగేకొద్దీ ఆ ఆలోచనలూ కార్యరూపం ధరిస్తున్నాయి. నికోలా టెస్లా 1898లో రేడియో తరంగాలతో నియంత్రించగలిగే యంత్రాన్ని రూపొందించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత దశలో మనిషితో సరిసమానంగా ఎత్తులేస్తూ.. విశ్వనాథన్ ఆనంద్‌లాంటి దిగ్గజాలకే చెక్ పెట్టగల యంత్రాలు వచ్చాయి. అలెన్ ట్యూరింగ్… కంప్యూటర్లు అనేవి కేవలం సమాచారాన్ని తీసుకుని, వాటిని ప్రాసెస్ చేసి, ఫలితాన్ని అందించే యంత్రాలుగా మాత్రమే మిగిలిపోకూడదనే లక్ష్యంతో ట్యూరింగ్ యంత్రాన్ని రూపొందించాడు. అలా, వాటంతట అవే సమాచారాన్ని విశ్లేషించుకునే ‘మెషీన్ లెర్నింగ్’ మొదలైంది. ఆ తర్వాత ఏఐ యంత్రాల వేగం పుంజుకున్నది. సంగీతం, రవాణా, ఉత్పత్తి… ఇలా అన్ని రంగాల్లో వీటి ఉనికి కనిపించింది. ఇక చాట్ జీపీటీ రాకతో ఒక్కసారిగా ‘మనిషి అవసరమే లేదు’ అన్నంత స్థాయిలో కృత్రిమ మేధ ప్రాభవం మొదలైంది. ఇదో పదునైన ఆయుధం. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని భయాలూ కలవరపెడుతున్నాయి. లాభాల్ని కొట్టిపారేయలేం, భయాలనూ పక్కనపెట్టేయలేం!
ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. సెలవు రోజులు, వేళాపాళా లేకుండా 24/7 ఉపయోగించుకోవచ్చు. మొదటిసారి ఎంత వేగంగా పనిచేస్తుందో… లక్షోసారి కూడా అంతే సమర్థంగా స్పందిస్తుంది. ఇక యాజమాన్యాలు మానవ వనరుల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువైపోతున్న ఉద్వాసనల వెనుక ఓ ముఖ్యకారణం.. కృత్రిమమేధ. రాబోయే దశాబ్దంలో ఏఐ ప్రభావంతో దాదాపు 40 కోట్ల ఉద్యోగాలు ఊడిపోవచ్చని ఓ అంచనా. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న ఉపాధిరంగానికి ఇది పిడుగులాంటి వార్తే. ప్యూ రీసెర్చ్ సంస్థ అధ్యయనం ప్రకారం.. 62 శాతం అమెరికన్లు ఈ పరిణామాల పట్ల భయంతో ఉన్నట్టు తేలింది. ఉద్యోగాల కోత ఒక్కో దేశం మీద ఒక్కోలా ఉంటున్నది. అమెరికా లాంటి దేశాల్లో ఆ ప్రభావం వలసల మీద ఉంటే.. చైనా, భారత్ లాంటి అధిక జనాభా దేశాల్లో మరింతమంది పేదరికంలోకి జారిపోయే ఆస్కారం ఉంది. ఏయే రంగాల్లో ఏ స్థాయి ఉద్యోగుల మీద ప్రభావం చూపుతుందనే విషయంలో ఇప్పటికే కొన్ని అంచనాలు వినిపిస్తున్నాయి. ఉత్పాదన, విద్యుత్, ఆహారం, ఐటీ… వంటి రంగాల మీద అపార ప్రభావం ఉండవచ్చని నిపుణుల లెక్కలు. తొలుత కిందస్థాయి ఉద్యోగుల మీదే పిడుగు పడుతుందనీ హెచ్చరిస్తున్నారు.
Artificial Intelligence3
నిర్విఘ్నంగా సర్వర్లు పనిచేయాలంటే నిరంతరం విద్యుత్ ఉండాలి. యంత్రాలు వేడెక్కిపోకుండా శీతలీకరణ జరగాలి. ఇందుకు చాలా వనరులే కావాలి. ఆ వనరులకు నీటిని కొలమానంగా తీసుకుంటే.. మనం అడిగే ఓ ఇరవై ఇరవై అయిదు ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చాట్ జీపీటీకి అరలీటరు నీటితో సమానమైన ఇంధనం అవసరం అవుతుందట. ఒకేసారి కోట్ల మంది చాట్ జీపీటీని వినియోగించుకుంటున్న ఈ సందర్భంలో… పుడమి ఎంత జల సంపదను సమర్పించుకుంటుందో, ఎంత వేడిని భరించాల్సి వస్తుందో.. ఒక్కసారి గమనించుకోవాలి. జీపీటీ-3 అనే కృత్రిమ మేధ సాంకేతికతను రూపొందించేందుకే మైక్రోసాఫ్ట్ ఏడులక్షల లీటర్ల నీరు వినియోగించుకుందట. ఎమ్ఐటీ నివేదిక ప్రకారం.. ప్రతి కొత్త ఏఐని రూపొందించిన ప్రతిసారీ.. 62 వేల పౌండ్ల కార్బన్-డై-ఆక్సైడ్ విడుదలవుతుంది. పర్యావరణం మీద ఈ ప్రభావం నేరుగా కనిపించకపోవచ్చు. కాబట్టే, చాలామంది పట్టించుకోరు. పర్యావరణం సంగతి దేవుడెరుగు, మన పని అయిపోతుందా లేదా? అనేదే ముఖ్యం అవుతున్నది. పని త్వరగా అయిపోవాలనే తపనే తప్పించి, మన ప్రతి మెయిల్, ప్రతి కమాండ్ వెనుక ఎన్నో సర్క్యూట్లు, సర్వర్లు పనిచేస్తాయని ఎప్పుడైనా గమనించామా? అంతేకాదు, చాలా సందర్భాల్లో కృత్రిమ మేధకు అనుబంధంగా చాలా యంత్రాలు అవసరం అవుతాయి. అవన్నీ ఏదో ఓ దశలో పాతబడతాయి. ఇ-వేస్ట్‌కు దారితీస్తాయి. పర్యావరణాన్ని ఖరాబు చేస్తాయి.
ఇప్పటికే ప్రతి ఒక్కరి డిజిటల్ ఫుట్ ప్రింట్ చాలా బలంగా దిగబడిపోయింది. మనం చేసే చిన్నపాటి సెర్చ్ ఆధారంగానే ఎక్కడికి వెళ్తున్నాం, ఏది ఇష్టపడుతున్నాం, సమయాన్ని ఎలా గడుపుతున్నాం… అన్నది పసిగట్టేయడం తేలికవుతుంది. మన ఫోన్లోని యాప్స్ అన్నీ కృత్రిమ మేధతో అనుసంధానమైపోయాయి. ఆ లింక్స్‌లో ఓ చిన్న కొక్కెం చాలు. మన సమాచారానికి గాలం వేయడానికి. ఇప్పటికే చైనాలో పౌరుల కదలికలను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ ఉపయోగిస్తున్నారు. రష్యాలో ఒక డోర్‌బెల్ సంస్థ, కస్టమర్ల కెమెరాల్లో
నమోదైన రూపురేఖలను పోలీసులకు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
Elon Musk
కృత్రిమ మేధను ఇప్పటివరకూ ఓ సౌకర్యంగానే భావించారు. కానీ చాట్ జీపీటీ రాకతో.. లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కృత్రిమ మేధ ఇంత త్వరగా, ప్రబలంగా రోజువారీ జీవితాల్లోకి వచ్చేస్తుందనుకోలేదు. చాట్ జీపీటీ మార్కెట్లోకి వచ్చీరాగానే ఎలన్ మస్క్‌తోపాటు దిగ్గజ సంస్థలకు చెందిన 1,800 మంది ఓ ఉత్తరంపై సంతకాలు చేశారు. తక్షణం కృత్రిమమేధను నిలువరించాలన్నది ఆ లేఖ సారాంశం. ‘సంఖ్యాపరంగా, మేధోపరంగా మనల్ని దాటేసి పనికిరానివారుగా చేసి.. మనుషులకు ప్రత్యామ్నాయంగా మారే మానవేతర మేధను ప్రోత్సహించాలా?’ అంటూ ఆ ఉత్తరం నిలదీసింది. కృత్రిమమేధకు సంబంధించి సురక్షితమైన నిబంధనలు రూపొందించాలనీ, వాటి పని తీరును బయటి వ్యక్తులతో బేరీజు వేయాలనీ సూచించింది. ఈమధ్యనే మస్క్ కార్ల కంపెనీ టెస్లా… మూడున్నర లక్షల కార్లను వెనక్కి రప్పించింది. వాటి సాఫ్ట్‌వేర్‌లో జరిగిన ఓ పొరపాటు వల్ల అవి సెల్ఫ్‌డ్రైవింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ఇలాంటి సందర్భాలతో కృత్రిమమేధ గురించి మస్క్లో కలవరం మొదలై ఉండవచ్చు.
ఇంతకుముందు ఫొటో లేదా వీడియోలో మొహాల్ని మార్చడం అసాధ్యం. ఎంత జాగ్రత్తగా అతుకుపెట్టినా ఆ తేడా స్పష్టంగా తెలిసిపోయేది. ఇప్పుడలా కాదు. వాస్తవానికి దగ్గరగా కృత్రిమ సంఘటనలనూ సృష్టించవచ్చు. మనిషిని నగ్నంగా మార్చి బజారుకు ఈడ్చేయవచ్చు. నిజం నిగ్గుదేలేలోపు పరువు మంటగలిసి పోతుంది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. కెరీర్లు సర్వనాశనమై పోతాయి. నాలుగు డబ్బులు ఇస్తే చాలు డీప్ ఫేకింగ్ చేసి పెడతాం అనే వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఎన్‌కోడర్స్ ప్రక్రియ ద్వారా రెండు చిత్రాల మధ్య సారూప్యతను క్షుణ్ణంగా గమనించి, ‘డీకోడర్స్’ సాంకేతికతతో అటూ ఇటుగా మార్చేస్తుంది డీప్ ఫేకింగ్. వీటికి జీఏఎన్ లాంటి సాంకేతికత జోడించి మరింత సహజంగా మార్చేస్తారు. అవసరం అయితే, వాటికి అతికినట్టు సరిపోయే స్వరాలను కూడా అమరుస్తారు. ఇప్పటికే పోర్న్ సైట్స్‌లో డీప్ ఫేకింగ్లు రాజ్యమేలుతున్నాయి. ఆర్థిక మోసాలకైతే హద్దులు లేకుండాపోతున్నది. బ్యాంకు ఖాతాలను ఊడ్చేస్తున్నారు. ఆ మధ్య కొంతమంది నేరస్తులు డీప్ ఫేక్ ద్వారా మరొకరి గొంతుకను అనుకరించి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్యాంక్ నుంచి 35 మిలియన్ డాలర్లు తస్కరించారు. రాబోయే రోజుల్లో ఇది మరింత ఊపందుకునే సూచనలు ఉన్నాయి.
Artificial Intelligence4
కృత్రిమ మేధ విశ్లేషణలతో ఆగిపోవడం లేదు. మెషీన్ లెర్నింగ్… అంటే తనంతట తానుగా నేర్చుకుంటున్నది. తనను తాను వృద్ధి చేసుకోగలుగుతున్నది. ఏదో ఒకరోజు అదుపుతప్పి మనల్నే సవాలు చేస్తుందనే భయం శాస్త్రవేత్తలకు లేకపోలేదు. ఇందుకు పదోవంతు మేర అవకాశం ఉందని కృత్రిమమేధలో పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిణామానికి x-risk అని పేరు పెట్టారు. ఇందుకు కొన్ని మార్గాలు కూడా ఊహిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం ఈ కృత్రిమ మేధ.. విలువలు, విచక్షణ లేని సూపర్ ఇంటెలిజెంట్‌గా మారిపోయి మనుషులు ఇచ్చే ఆదేశాలను బేఖాతరు చేయడం మొదలుపెడుతుంది. ఆ మేధ అనూహ్యంగా పెరిగిపోయి, మనుషుల పరిధిని దాటేస్తుంది. యంత్రాలు మనిషిని జయిస్తాయనే ఈ భయాన్ని 1863లోనే శామ్యూల్ బట్లర్ అనే రచయిత వ్యక్తపరిచారు. అడపాదడపా ఐ రోబో, టెర్మినేటర్ లాంటి చిత్రాలు కూడా ఇలాంటి ఇతివృత్తంతో భయపెట్టాయి. ఈ భయాలను పూర్తిగా కొట్టిపారేయలేం కూడా!
చెడువైపు మళ్లకుండా కృత్రిమమేధను నిరోధించే పరిస్థితి అయితే లేదు. కాకపోతే, ఆన్లైన్ జీవులుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
☞ కంపెనీలు డేటాను ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు అనే విషయం మీద కచ్చితమైన, సార్వజనికమైన చట్టాలు లేకపోవడం పెద్ద లోటు. ఇప్పుడిప్పుడే ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతున్నాయి. అమెరికాలో Algorithmic Accountability Act రూపొందించారు. జీ7, జీ20 తదితర కూటములు ఈ విషయంలో కొన్ని నిబంధనలు తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.
☞ కృత్రిమమేధ కోసం ప్రోగ్రామ్ చేసేవారు.. తమ లక్ష్యాలను, ఉద్దేశాలను తెలియచేయాలి. అల్గారిధమ్స్ స్పష్టంగా, సరళంగా ఉండాలి. దీన్నే Explainable Artificial Intelligence (XAI) అంటారు.
☞ మనిషి ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా స్పందించాలి.. అనే విషయంలో కొన్ని నైతిక సూత్రాలు ఉంటాయి. ఏఐకి కూడా ఇలాంటి మార్గదర్శకాలు ఉండాలి అనే వాదన పెరుగుతున్నది. ఇలాంటి వాదనలకు జవాబుగా కృత్రిమమేధ కంపెనీలు భారీ హామీలు గుప్పిస్తూ కాలం గడిపేస్తున్నాయి. దీన్ని ‘ఎథిక్స్ వాషింగ్’ అంటారు.
☞ కృత్రిమమేధతో ఏ పనైనా చేయవచ్చని తెలిసిపోయింది. అలా అని ప్రతిదానికీ దాని ఆ సాంకేతికత మీద ఆధారపడకూడదన్నది నిపుణుల హెచ్చరిక. ఏ రంగాల్లో ఎంతవరకు వినియోగించాలి అనే విషయం మీద ఓ కొలమానం ఉండాలి.
☞ సాంకేతికత వల్ల కలిగే నష్టాన్ని సాంకేతికత ద్వారానే నివారించడం మరో పద్ధతి. ఉదాహరణకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆర్థిక లావాదేవీలు దారితప్పకుండా చూసుకుంటుంది. ఏఐకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో, దాన్ని నియంత్రించే వ్యవస్థకు అంతకుమించిన ప్రాధాన్యం ఇస్తేనే నష్టాలను నివారించగలం.
☞ కృత్రిమ మేధ రకరకాల విశ్లేషణలు చేయగలదు, నిర్ణయాలు తీసుకోగలదు. కానీ ఆ నిర్ణయాన్ని అమలు చేయడం అనేది మనుషుల చేతుల్లోనే ఉండాలనేది మరో సూచన. వ్యక్తిగతంగానూ ఏఐ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎడాపెడా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం, అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చేయడం, అన్ని సాంకేతిక పరికరాలను అనుసంధానించడం, వ్యక్తిగత వివరాలను అవసరానికి మించి సోషల్ మీడియాలో ఉంచుకోవడం.. లాంటి సవాలక్ష తప్పుల నుంచి దూరంగా ఉండాలి. స్మార్ట్ఫోన్లు మన మాటలు వింటున్నాయి, టైప్ చేసే ప్రతి అక్షరం మరొకరికి డేటాగా మారుతున్నది. సోషల్ మీడియా మన నీడలా మారింది. ఇలాంటి కఠినమైన వాస్తవాలను గుర్తించాలి. జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే, మన డేటా భద్రంగా ఉంటుంది.
నిజానికి కృత్రిమమేధ వల్ల లాభాలు చెప్పుకోవడం మొదలుపెడితే పెద్ద చిట్టా అవుతుంది.
☞ మనుషులకు సాధ్యం కాని పనులు, యాంత్రికంగా చేయాల్సిన పనులకు కృత్రిమ మేధే సమాధానం అని ఒక వాదన.
☞ వాతావరణంలో వచ్చే చిన్నపాటి మార్పులను డేటా ద్వారా పసిగట్టి ఎలాంటి ఉపద్రవం గురించైనా ముందస్తుగా హెచ్చరించగలదు ఏఐ.
☞ సిరి, అలెక్సా లాంటివి కృత్రిమమేధ సాయంతో నోటిమాటతో సౌకర్యాలన్నీ చేరువ చేస్తున్నాయి. కారు స్టీరింగ్ మీద చేయి వేయాల్సిన పనే లేని రోజులు ఇప్పటికే వచ్చేశాయి.
☞ విద్యుత్, రవాణా రంగాల్లో చిన్నపాటి అవాంతరమూ లేకుండా కృత్రిమమేధ సాయపడుతుంది.
☞ AI for Earth లాంటి ప్రాజెక్టుల ద్వారా కర్బన ఉద్గారాలను అంచనా వేయడం, జీవజాతులను గుర్తించడం, అటవీ భూమిని నమోదు చేయడం లాంటి ఎన్నో సేవలతో పర్యావరణానికి మేలు చేస్తున్నది కృత్రిమమేధ.
☞ మరింత వేగంగా, లోపాలకు ఆస్కారం లేకుండా ఉత్పాదకత జరుగుతుందని అంచనా. చాట్ బాట్ల ద్వారా నియోగదారులకు సత్వర పరిష్కారం అందేలా చేస్తుంది.
☞ యాంత్రీకరణ… ముఖ్యంగా ఆర్థికరంగంలో ఆటోమేషన్ వల్ల, అవినీతికి ఆస్కారం తగ్గుతుందని ఆశ. క్లిష్టమైన పరిశోధనలు, ప్రయోగాలు, ట్రయల్స్… అన్నీ కూడా ఇక మీదట చాలా తేలిక కానున్నాయి.
☞ భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు అన్నది చెప్పే జన్యు విశ్లేషణ… పుట్టబోయే పిల్లలు ఎంత బాగా ఉండాలో నిర్ణయించే జీన్ ఎడిటింగ్.. ఏఐతోనే సాధ్యం.
కృత్రిమ మేధ ఓ ఆయుధం. దానివల్ల ఎంత మేలు జరుగుతున్నదో.. కీడూ ఆ స్థాయిలోనే ఉండటం సహజం.
☞ ఏఐ నిర్ణయాలు కేవలం సమాచారం మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి, వివక్షకు తావు ఎక్కువ. ఉదాహరణకు ఓ వర్గాన్నో, వర్ణాన్నో, దేశాన్నో దోషిగా చూపించే కంటెంట్ తనకు ఎక్కువగా అందితే, వాళ్లందరూ కూడా దోషులే అన్న నిర్ణయానికి వచ్చేస్తుంది. ఇప్పటికే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్లు నల్లజాతివారిని దోషులుగా గుర్తిస్తున్నట్టు తేలింది. దీంతో శాన్ఫ్రాన్సిస్కో వంటి కొన్ని నగరాల్లో పోలీసులు ఈ టెక్నాలజీని తోసిపుచ్చారు.
☞ కొవిడ్ తర్వాత డిజిటల్ డివైడ్ అన్న మాట బాగా ప్రచారంలోకి వచ్చింది. సాంకేతికత అందుబాటులో ఉన్నవారు, దాని గురించి తెలిసినవాళ్లు… సంపాదన పెంచుకుంటూ వెళ్తే… పేదలు, నిరక్షరాస్యులు మరింత వెనకబడుతున్నారు. ఈ అంతరం మరింత పెరిగిపోక తప్పదు.
☞ Lethal Autonomous Weapons Systems ప్రమాదం పసిగట్టినప్పుడు మనుషుల నిర్ణయం లేకుండానే వెలువడే ఆయుధాలివి. రాబోయే రోజుల్లో వీటి ప్రాధాన్యం పెరగబోతున్నది. ఏఐ కనుక తప్పుదారి పడితే ఆ తీవ్రత ఏపాటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
☞ సోషల్ మీడియా ద్వారా నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని ఈ పాటికే తెలిసొచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి వెనుక ఇలాంటి యంత్రాంగమే ఉందని ఆరోపణ. ఇప్పటికే మన ‘ఫీడ్’ను బట్టి ఎలాంటి పోస్టులు, ఎవరి పోస్టులు చూడాలో సోషల్ మీడియాలోని ఏఐ నిర్ణయిస్తున్నది. ఆ మాటకొస్తే కారు నుంచి ఏసీ వరకు.. స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న ఏ రంగమైనా మనల్ని తన నిర్ణయాలకు అనుగుణంగా మార్చేసుకోవచ్చు.
☞ ఆర్థిక వ్యవస్థ మొత్తంకృత్రిమమేధపై ఆధారపడుతున్నది. దానివల్ల ఆ రంగంలో ఎలాగూ ఉద్యోగాలు తగ్గిపోనున్నాయి. కానీ గొలుసుకట్టులాంటి ఈ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరిగినా, దాని ఫలితాలు విస్తృతంగా ఉంటాయి. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేలోగా దేశాలకు దేశాలే ఊబిలో కూరుకుపోవచ్చు.
కృత్రిమమేధ ఓ ఆయుధం. మనిషేమో స్వార్థపరుడు. పోటీతత్వం, వస్తు వినిమయం రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో సాంకేతికత ఎవరి చేతిలో రాక్షసరూపం ధరిస్తుందో ఊహించలేం. ప్రభుత్వాలు, వైజ్ఞానిక సంస్థలు, ప్రపంచదేశాల సమాఖ్యలు… అన్నిటికీ మించి సమాజం కొన్ని కచ్చితమైన నిబంధనలు రూపొందించుకుని.. వాటిని కచ్చితంగా పాటించినంత కాలం మనం సురక్షితంగా ఉన్నట్టే.
– కె.ఎల్.సూర్య