e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home సంగారెడ్డి గడపదాటలే!

గడపదాటలే!

గడపదాటలే!
  • రెండో రోజూ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు
  • బోసిపోయి కనిపించిన పట్టణాలు
  • యథావిధిగా వైద్యసేవలు, కరోనా టీకా పంపిణీ
  • గ్రామాల్లో లాక్‌డౌన్‌ ప్రభావం, పోలీసుల ఈ పాస్‌ల జారీ

సంగారెడ్డి, మే 13, నమస్తే తెలంగాణ : సంగారెడ్డి జిల్లాలో రెండోరోజు లాక్‌డౌన్‌ విజయవంతమైంది. గురువారం జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేసింది. సడలింపు సమయంలో ప్రజలు బయటకు వచ్చి ఉదయం 10గంటల లోపు నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత జనం పూర్తిగా ఇండ్లకే పరిమితమయ్యారు. పట్టణాలతోపాటు పల్లెల్లోని ప్రజానీకం ఇంటి నుంచి గడప దాటకుండా స్వీయనియంత్రణ పాటించారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ వైద్య సేవలు, కరోనా నిర్ధారణ పరీక్షలు, టీకాల పంపిణీ యథావిధిగా కొనసాగాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి సహా పటాన్‌చెరు, రామచంద్రాపురం, జహీరాబాద్‌, సదాశివపేట, జోగిపేట, నారాయణఖేడ్‌ తదితర పట్టణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా అమలు చేశారు. దీంతో పట్టణాల్లోని ప్రధాన రహదారులు జనసంచారం లేక బోసిపోయి కనిపించాయి. పట్టణాల్లో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లును మూసివేశారు. నిబంధనలను ఉల్లఘించి వాహనాలపై సంచరిస్తున్న వారిని పోలీసులు తిరిగి ఇండ్లకు పంపించారు. సంగారెడ్డిలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ముందస్తు పాస్‌లు లేకుండా బయటకువచ్చిన వారిని ఇళ్లకు తిరిగి పంపించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో 65వ నెంబరు జాతీయ రహదారిపైనా పోలీసులు పికెటింగ్‌ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. పటాన్‌చెరు నియోజకవర్గంలోని పలు పరిశ్రమల యాజమాన్యాలు కార్మికులు ఇబ్బంది పడకుండా ముందస్తుగా జిల్లా అధికారుల అనుమతులు తీసుకున్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద పోలీసులు గస్తీ పెంచారు. నారాయణఖేడ్‌లో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి లాక్‌డౌన్‌ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులతో మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని ఆదేశించారు.
జనంలో పెరిగిన చైతన్యం
ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయానికి సంగారెడ్డి జిల్లాలోని అన్నివర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నది. కొవిడ్‌ను అరికట్టే విషయంలో ప్రజల్లోనూ చైతన్యం కనిపిస్తుంది. లాక్‌డౌన్‌ వేళల్లో ప్రజలు స్వచ్ఛందంగా స్వీయనియంత్రణ పాటిస్తూ ఇండ్లకే పరిమితం అవుతున్నారు. ప్రజలు స్వీయనింత్రణ పాటిస్తూ లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుండడంతో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ఖాయమని అధికారులు చెబుతున్నారు.
యథావిధిగా వైద్యసేవలు, టీకా పంపిణీ
జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉన్నప్పటికీ ప్రభు త్వ, ప్రైవేటు దవాఖానల్లో వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. గురువారం కరోనా నిర్థారణ పరీక్షలు, కరోనా టీకా పంపిణీ సైతం జరిగాయి. జిల్లాలోని 39 కేంద్రాల్లో కరోనా టీకా పంపిణీ కొనసాగింది. 1500 మందికిపైగా టీకా వేసుకున్నట్లు తెలుస్తున్నది. సంగారెడ్డి, పటాన్‌చెరు దవాఖానలతోపాటు పీహెచ్‌సీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను వైద్య సిబ్బంది నిర్వహించారు. గురువారం 1668 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో 114 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి వైద్యం అందజేస్తున్నారు. ఇదిలాఉండగా, జిల్లాలోని మున్సిపాలిటీలు, పల్లెల్లో ఇంటింటి ఆరోగ్య సర్వే కొనసాగుతున్నది. జ్వర లక్షణాల కనిపించిన వారికి వైద్య బృందాలు కరోనా కిట్‌ అందజేస్తున్నాయి.
ఈ పాస్‌ల జారీ..
లాక్‌డౌన్‌ మినహాయింపు కోరుతూ ఈ పాస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి పోలీసుశాఖ వెంటనే పాస్‌లు జారీ చేస్తున్నది. బుధ, గురువారాల్లో సుమారు 1000 మందికి ఈ పాస్‌లు జారీ చేశామని అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ మినహాయింపు కోరుతూ జిల్లాలోని అన్ని ప్రాం తాల వారు ఈ పాస్‌కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే ఈపాస్‌ మంజూరు చేసేలా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలాఉంటే నారాయణఖేడ్‌లో లాక్‌డౌన్‌ను పరిశీలించిన ఎస్పీ చం ద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గడపదాటలే!

ట్రెండింగ్‌

Advertisement