మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Jul 17, 2020 , 23:13:03

డంపింగ్‌ యార్డుల నిర్మాణాల్లో సంగారెడ్డి ఆదర్శం

డంపింగ్‌ యార్డుల నిర్మాణాల్లో సంగారెడ్డి ఆదర్శం

  •  అభివృద్ధిలో పటాన్‌చెరు ముందంజ n రాష్ట్రంలోనే జిన్నారం నెంబర్‌ వన్‌
  •  రైతు వేదికలు త్వరగా పూర్తిచేయాలి n ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
  •  సంగారెడ్డి జిల్లాలో పర్యటన n అభివృద్ధి పను పరిశీలన

పటాన్‌చెరు: వందశాతం డంపింగ్‌ యార్డులు నిర్మించి సంగారెడ్డి జిల్లా రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందని, అభివృద్ధిలో పటాన్‌చెరు ముందంజలో ఉన్నదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సొంత నిధులతో ఇస్తున్న ఏడు ట్రాక్టర్లను వివిధ చిన్న పంచాయతీల సర్పంచ్‌లకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఎమ్మెల్యే సొంత నిధులు రూ. 4కోట్ల 40లక్షలు ఖర్చు చేసి, 40 జీపీలకు ట్రాక్టర్లను అందించడం అభినందనీయమని కొనియాడారు. పటాన్‌చెరులో అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఆనందం కలుగుతోందన్నారు. సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. 647పంచాయతీల్లో డంపింగ్‌ పనులు పూర్తయ్యాయన్నారు. వైకుంఠధామాలు, రైతు వేదికలనూ పూర్తి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. సీఎం కేసీఆర్‌ నర్సరీల ద్వారా హరితహారం, డంపింగ్‌ యార్డులను ప్రోత్సహిస్తున్నారన్నారు.

కరోనాపై భయం వద్దు..

కరోనా వైరస్‌పై ప్రజలు భయాందోళనకు గురికావద్దని మంత్రి హరీశ్‌రావు సూచించారు. కనీస జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ దరిదాపుల్లోకి రాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికే దవాఖానల్లో అన్ని రకాల వసతులను కల్పించిందన్నారు. వైరస్‌ లక్షణాలుంటే ప్రాథమిక దశలోనే వైద్యులను కలవాలని కోరారు. సంగారెడ్డిలో వంద పడకల కొవిడ్‌ దవాఖాన ప్రారంభిస్తున్నామని తెలిపారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రజల్లో ఉండి సేవలందిస్తున్నారన్నారు. ప్రతీ పంచాయతీ అభివృద్ధి చెందాలనేది తన లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు అన్ని పంచాయతీల్లోనూ ట్రాక్టర్లను కొనుగోలు చేస్తున్నామన్నారు. తాము ట్రాక్టర్లు కొనలేని స్థితిలో ఉన్నాయని కొన్ని పంచాయతీల సర్పంచ్‌లు చెప్ప గా, తన సొంత నిధులతో 40 ట్రాక్టర్లు, ట్రాలీలు అందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, కలెక్టర్‌ హనుమంతరావు, మార్కెట్‌ కమిటీ అధ్యక్షురాలు హారిక, జడ్పీటీసీలు సుప్రజ, సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ సుష్మ, మున్సిపల్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్‌ అలీ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నా యకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రైతు వేదికలు త్వరగా పూర్తి చేయాలి

సంగారెడ్డి: జిల్లాలో రైతు వేదికల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అదేశించారు. సంగారెడ్డిలో పర్యటనకు వచ్చిన సందర్భంగా కంది మండల కేం ద్రంలో నిర్మిస్తున్న రైతువేదిక పనులను మంత్రి పరిశీలించారు. వేదిక ప్రాంగణంలో మొక్కలునాటి నీళ్లు పోశారు. నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని ఇంజినీర్లకు సూచించారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ కా ర్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేసిన ఇంజినీర్లు, సిబ్బందిని మంత్రి సన్మానించారు. పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, ఎంపీ పీ సరళపుల్లారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జిన్నారం నెంబర్‌ వన్‌

జిన్నారం: డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు పూర్తి చేసుకున్న తొలి మండలంగా జిన్నారం మండలం రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచిందని మంత్రి హరీశ్‌రావు అన్నా రు. పనులు త్వరగా పూర్తి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి  ప్రత్యేకంగా అభినందించారు. జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో పూర్తయిన వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో కలిసి శుక్రవారం మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. పచ్చటి చెట్ల మధ్య ఉన్న వైకుంఠధామం, డంపింగ్‌ యార్డులను చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వైకుంఠధామంలో మంత్రి మొక్కలు నాటారు. బాగా పనిచేసిన  సర్పంచ్‌ శివరాజ్‌, ఎంపీటీసీ సంతోష, ఎంపీడీవో సుమతి, తహసీల్దార్‌ దశరథ్‌, కార్యదర్శి సాధనను మంత్రి సన్మానించారు. జిన్నారం మండలంలోనే కాకుండా సంగారెడ్డి జిల్లాలో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు పూర్తి అయినట్లు చెప్పారు. అనంతరం మంత్రికి గ్రామ యువకులు మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హన్మంతరావు, అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, వీరారెడ్డి, జడ్పీవైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, మండల ప్రత్యేకాధికారి ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్‌, సర్పంచ్‌లు లావణ్య, ప్రకాశ్‌చారి, ఆంజనేయులు, చిట్ల సత్యనారాయణ, నాయకులు గద్దె నర్సింలు, రాజేశ్‌, అభిలాష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, జిన్నారం మండలం కొడకంచి గ్రామానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. సర్వేనంబర్‌ 36, 37, 38లోని 45.15 ఎకరాల్లో వంద మంది రైతులు 18 ఏండ్లుగా సాగు చేస్తున్నా రని, అటవీ శాఖ అధికా రులు ఆ భూమి తమద ని అంటుండగా, కొంద రు నాయకులు తమ ప ట్టాభూమి అని భయపె డుతున్నాని చెప్పగా, సమస్యను పరిష్కరించా లని కలెక్టర్‌కు మంత్రి హరీశ్‌రావు సూచించారు.  logo