శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Feb 18, 2020 , 01:17:46

డెడ్‌లైన్‌ 26

డెడ్‌లైన్‌ 26

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి పనులను ఈ నెల 26వ తేదీ వరకు పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో పల్లె ప్రగతి - పంచాయతీరాజ్‌ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు.

 • పల్లె ప్రగతి లక్ష్యాలు పూర్తి చేయాలి
 • సంగారెడ్డిని అభివృద్ధిలో నెంబర్‌-1 గా నిలుపాలి
 • ఏ క్షణంలోనైనా తనిఖీలు నిర్వహిస్తాం
 • పనిచేయని వారిపై కఠిన చర్యలు
 • గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా రూ.339 కోట్లు
 • ప్రతి నెల డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలకు రూ.61 కోట్లు
 • గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.500 కోట్లు
 • పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధి
 • ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా మార్చాలి
 • వంద శాతం తడి, పొడి చెత్త సేకరణ చేయాలి
 • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లె ప్రగతి పనులను ఈ నెల 26వ తేదీ వరకు పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో పల్లె ప్రగతి - పంచాయతీరాజ్‌ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పల్లె ప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, నర్సరీ దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు. గ్రామాలను పారిశుధ్య పంచాయతీలుగా తీర్చిదిద్దాలని, డంపు యార్డులు నిర్మించి తడి-పొడి చెత్తను వేరు చేయాలన్నారు. ఏ గ్రామంలో అయినా పనులు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, బాగా చేసిన వారికి సన్మానాలు, అవార్డులు ఉంటాయన్నారు. అభివృద్ధిలో సంగారెడ్డి జిల్లా నెంబర్‌-1 స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావులు ప్రసంగించారు. 

- సంగారెడ్డి టౌన్‌ 


సంగారెడ్డి టౌన్‌: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పల్లెప్రగతి పనులను ఈ నెల 26వ తేదీ వరకు లక్ష్యాలు పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. సోమవారం సంగారెడ్డి పట్టణంలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో పల్లె ప్రగతి-పంచాయతీరాజ్‌ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పల్లెప్రగతిలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, నర్సరీ దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు. పల్లెప్రగతి ద్వారా గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. 60 ఏండ్లుగా గత ప్రభుత్వాలు మోస పద్ధతిలో పని చేశాయని, వాటిని ఒకే సారి మార్చాలంటే సాధ్యం కాదన్నారు. కానీ వాటిని మార్చాల్సిన అవసరం ఉన్నదన్నారు. లేదంటే గత ప్రభుత్వాలకు మనకు తేడా లేదన్నారు. గ్రామాలను పారిశుధ్య గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని గ్రామాల్లో డంపుయార్డులు నిర్మించి తడి-పొడి చెత్తను వేరు చేయాలన్నారు. తడి చెత్తను వర్మీకంపోస్టుగా తయారీ చేసి మొక్కలకు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొడి చెత్తను వేరుగా నిల్వ చేసుకుంటే పంచాయతీలకు డబ్బులు ఇచ్చి కరెంట్‌ తయారు చేసేందుకు కొనుగోలు చేస్తారన్నారు. దీని వల్ల పంచాయతీకి లాభం వస్తుందన్నారు. వర్మీకంపోస్టు తయారీ కోసం డీపీవోలు, ఎంపీడీవోలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. 


వర్మీకంపోస్టు తయారు మొదటగా ఏ గ్రామ సర్పంచ్‌ చేస్తారో వారికి సన్మానం చేస్తామన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లతో ముచ్చటించారు. గ్రామాల్లో డంపింగ్‌యార్డులు, శ్మశాన వాటికలు నిర్మాణం చేశారా, గ్రామాల్లో బుగ్గలు వెలుగుతున్నాయా, గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ వచ్చాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో  డంపుయార్డు, చెత్త సేకరణ, శ్మశాన వాటిక, నర్సరీ, ఇంకుడు గుంతలు, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, మరుగుదొడ్లను ఉపయోగంలోకి తేవడం, నల్లలు బిగించడం, ప్రతి గామంలో 85శాతం మొక్కలు బతికేలా చూడడం లాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలను చేయాల్సిన బాధ్యత సర్పంచ్‌లది, గ్రామ కార్యదర్శులదేనన్నారు. ఏ గ్రామంలో అయినా ఈ పనులు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, బాగా చేసిన వారికి సన్మానాలు అవార్డులు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నదని వివరించగా, 4నెలల పాటు నీటి సమస్య ఉంటుందని, అవసరం ఉన్న చోట వ్యవసాయ పొలాల వద్ద పంటలు వేయని రైతుల నుంచి నీటిని కొనుగోలు చేయాలని, నెలకు రూ.4వేల ఇవ్వాలని అధికారులకు సూచించారు. 


ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా  తీర్చిదిద్దాలి

జిల్లాను ప్లాస్టిక్‌ రహిత సంగారెడ్డిగా తీర్చిదిద్దాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. చెత్త బుట్టలు ఇచ్చాం. ఎవరైనా సహకరించకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సహకరించని వారికి రూ.500 జరిమానా విధించాలని అధికారులకు, సర్పంచ్‌లకు సూచించారు. వంద శాతం తడి, పొడి చెత్త సేకరణ చేయాలని సూచించారు. అభివృద్ధిలో సంగారెడ్డిని నెంబర్‌-1 స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా నెంబర్‌-1 స్థానంలో నిలుస్తుందన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ, మొక్కలు నీటిని పట్టేందుకు, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ను పంపిణీ చేశామన్నారు. దేశంలో ఎక్కడ కూడా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.500 కోట్లను వారం రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు ప్రసంగించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హనుమంతరావు, అడిషనల్‌ కలెక్టర్‌ రాజర్షి షా, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, వివిధ మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


జడ్పీటీసీ అపర్ణను సన్మానించిన మంత్రి

వట్‌పల్లి: 30 రోజులు ప్రణాళిక, 2వ విడుత పల్లెప్రగతి పనులు చక్కగా నిర్వహించారు. మండలంలోని గ్రామాలన్నీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ముందు..ముందు కూడా ఇలాగే పని చేసి చక్కటి గుర్తింపు పొందాలని వట్‌పల్లి జడ్పీటీసీ అపర్ణశ్రీకాంత్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. సోమవారం సంగారెడ్డిలో నిర్వహించిన పల్లెప్రగతి సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు అధికారుల ద్వారా మండలంలో జరిగిన అభివృద్ధి పనుల విషయాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేస్తూ జడ్పీటీసీ అపర్ణను శాలువాతో సన్మానించారు. 


4నెలల్లో సింగూర్‌కు కాళేశ్వరం జలాలు

సింగూర్‌ ప్రాజెక్టు మరో 4నెలల్లో కాళేశ్వరం జలాలు రానున్నాయని, వాటి ద్వారా జిల్లాలో శాశ్వత నీటి సమస్య తీరుతుందన్నారు. వేసవి కాలం నాలుగు నెలల పాటు నీటికి ఇబ్బంది ఉంటుందన్నారు. గ్రామాల్లో నీటి ఎద్దడి తీర్చేందుకు సింగూర్‌ ప్రాజెక్టులో 1.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచడం జరిగిందని, ఆ నీటి ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటిని సరపరా చేస్తామన్నారు. నాలుగైదు రోజుల్లో మిషన్‌ భగీరథ ద్వారా నీటిని విడుదల చేస్తామన్నారు. వేసవి కాలం ముగిసే లోపు కాళేశ్వరం జలాలు సింగూర్‌ ప్రాజెక్టుకు వస్తాయన్నారు. 


logo