Parigi | పరిగి, ఏప్రిల్ 1: పోలీస్‌స్టేషన్‌కు సుమారు 500 మీటర్ల దూరంలో రెండు గ్రూపులకు చెందిన యువకులు కొట్టుకొని హంగామా సృష్టించారు. చేతికి ఏది దొరికితే దానితోనే దాడికి పాల్పడ్డారు. కేవలం మాట్లాడదామని పిలిచి ఒక వర్గం తమపై దాడి చేసినా అదే వర్గం ఇచ్చిన ఫిర్యాదుతో తమపై కేసు నమోదు చేశారని రెండో వర్గం ఆరోపిస్తున్నది.
వివరాల్లోకి వెళ్తే.. మార్చి 30వ తేదీ ఆదివారం ఉదయం పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డలో గల ఓ టీ స్టాల్ దగ్గర టీ తాగే సమయంలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు కొట్లాడుకోగా సాయంత్రం పరిగిలోని పోలీస్‌స్టేషన్ సమీపంలో గల చాయ్ అడ్డా వద్ద మాట్లాడుకుందామని చెప్పడంతో ఇరువర్గాలు అక్క డికి చేరుకున్నాయి. మాట్లాడుతున్న సందర్భంలో ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు మళ్లీ కొట్లాటకు దిగి ఇష్టం వచ్చినట్లుగా కొట్టుకున్నారు. కూల్‌డ్రింక్స్ బాటిల్స్‌తో చాయ్ అడ్డాలోని వస్తువులతో పరస్పర దాడులకు దిగారు. తద్వారా చాయ్ అడ్డా యజమానికి తీవ్ర నష్టం వాటిల్లింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాల యువకులను సమదా యించారు. ఇదిలావుండగా సోమవారం ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. గంజాయి మత్తులో తమపై దాడికి పాల్ప డ్డారంటూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
ఇదిలా వుండగా రెండు గ్రూపుల యువకులు నానా హంగామా సృష్టించి పరస్పర దాడికి పాల్పడిన సీసీటీవీ పుటేజీ బయటకు రావడంతో వైరల్‌గా మారింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు రెండు వర్గాలకు చెందిన 40 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరిగి ఎస్ఐ సంతోష్‌కుమార్ తెలిపారు.