పెద్దఅంబర్‌పేట, అక్టోబర్ 19: ఓఆర్ఆర్పై ఆగిఉన్న లారీని వెనుకనుంచి డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్నూర్ గ్రామానికి చెందిన చితలూరి గణేశ్ (23) అనే యువకుడు ఎల్బీనగర్లో రాజ్గౌడ్కు చెందిన దుర్గా ఫైర్ వర్క్ దుకాణంలో కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి డీసీఎంలో పటాకులు లోడ్ చేసి ఇతర కూలీలతో కలిసి ఘట్కేసర్లో సరుకులు దించేశారు.
తిరిగి ఎగ్జిట్ నంబర్ 10 వద్ద ఓఆర్ఆర్ ఎక్కి మహేశ్వరంలోని గోడౌన్‌కు బయలుదేరారు. గణేశ్ డ్రైవర్ పక్కన క్యాబిన్లో కూర్చోగా.. మిగతావారు డీసీఎం వెనక కూర్చున్నారు. మార్గమధ్యలో ఓఆర్ఆర్పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని డీసీఎం వెనుకనుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో గణేశ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు కూలీలు సందీప్, సతీశ్ గాయపడ్డారు. గణేశ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.