వికారాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): జిల్లాలో యాసంగి సీజన్ వరి ధాన్యం సేకరణ తరువాత డబ్బుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ధాన్యం అమ్మి పదిహేను రోజులు దాటినా డబ్బులు రాకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది.
ఇప్పటివరకు రూ.26.52 కోట్ల విలువైన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించిన జిల్లా పౌరసరఫరాల శాఖ.. రూ.1.78 కోట్ల చెల్లింపులు మాత్రమే పూర్తి చేసింది. మిగతా రూ.25.07 కోట్ల చెల్లింపులు పెండింగ్‌లోనే ఉండడంతో సంబంధిత రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. మరోవైపు యాసంగి సీజన్‌కుగాను ఏ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2203, సాధారణ రకం క్వింటాలుకు రూ.2183 చొప్పున మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తున్నది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే ధాన్యం డబ్బులను జమ చేస్తున్నది. జిల్లాలో 84,848 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా.. 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
జిల్లాలో మొత్తం 129 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అధికారులు ధాన్యం సేకరిస్తున్నారు. యాసంగి సీజన్‌కు సంబంధించి 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 2913 మంది రైతుల నుంచి రూ.26.52 కోట్లు విలువ చేసే 12,093 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో నుంచి ఇప్పటివరకు 10,199 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు తరలించగా, మిగతా 1894 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించాల్సి ఉన్నది. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు 40 గోదాంలను సిద్ధం చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాములకు ధాన్యాన్ని తరలించే పనిని జిల్లా యంత్రాంగం నాలుగు ఏజెన్సీలకు అప్పగించింది.
– పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సుగుణ బాయి
జిల్లావ్యాప్తంగా ధాన్యాన్ని విక్రయించే రైతులెవరికీ ఇబ్బందులు కలుగకుండా సత్వరమే చెల్లింపులు జరిగేలా చర్యలు చేపడుతున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను రెండు రోజుల్లోగా పూర్తి చేస్తాం. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీ చేయకపోవడంతోనే బిల్లుల చెల్లింపు పూర్తి కాలేదు.