వికారాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి ఆయా పంటల సాగు జోరందుకున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 45,532 ఎకరాల్లో ఆయా పంటలను రైతులు సాగు చేశారు. అత్యధికంగా వేరుశనగను సాగు చేయగా.. అత్యల్పంగా చెరుకును సాగు చేశారు. వరి నాట్లు వేసే ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా ఆయా పంటల విస్తీర్ణం మరింత పెరిగే అవకాశమున్నది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 9942 ఎకరాల్లో వరి పంటను జిల్లా రైతాంగం సాగు చేసింది.
ఈ నెలాఖరు వరకు వరి నాట్లు వేసేందుకు అనుకూలం దృష్ట్యా జిల్లాలో వరి సాగు 40 వేల ఎకరాల వరకు పెరిగే అవకాశమున్నట్లు జిల్లా వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. 6675 ఎకరాల్లో జొన్న, 4340 ఎకరాల్లో మొక్కజొన్న, 221 ఎకరాల్లో చెరుకు, 13,444 ఎకరాల్లో వేరుశనగ, 2551 ఎకరాల్లో పొద్దుతిరుగుడు, 5628 ఎకరాల్లో శనగ, 1201 ఎకరాల్లో కందులు, 92 ఎకరాల్లో బఠాణీ, 1439 ఎకరాల్లో ఇతర పంటలు సాగయ్యాయి. ఆయా పంటల సాగుకు సంబంధించి వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు పంటల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. మరోవైపు జిల్లా రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సరిపోను ఎరువులు, విత్తనాలను సరఫరా చేస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్‌కు సంబంధించి వరి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటివరకు 9942 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, ఈ నెలాఖరు వరకు వరి నాట్లు వేసే అవకాశం ఉన్న దృష్ట్యా 40 వేల ఎకరాలకు వరి సాగు పెరుగనున్నది.
యాసంగి సీజన్లో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ గత రెండేండ్ల నుంచి కొనసాగుతున్నది. కొనుగోలు విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు పర్యటిస్తూ రైతులవారీగా సర్వే నంబర్, సాగు విస్తీర్ణంతోపాటు చేసిన పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతి వివరాలతోపాటు రైతుల సంతకాలను సేకరిస్తున్నారు. భూమి యజమాని ఫోన్ నంబర్ తదితర వివరాలను మరో యూనిట్‌గా తీసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పంటల వివరాల సేకరణలో భాగంగా నీటి ఆధారాలైన బోర్లు, బావులు, చెరువుల వివరాలను, రైతులు సాగు చేస్తున్న పంటల ద్వారా రానున్న దిగుబడి వివరాలను కూడా అంచనా వేస్తున్నారు.
యాసంగి సీజన్‌కు సంబంధించి వరి నాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు వరి నాట్లు వేసుకునేందుకు అనుకూలం. జిల్లాలో వరి 40 వేల ఎకరాల వరకు సాగయ్యే అవకాశముంది. రైతులు సాగు చేసే ఆయా పంటల వివరాలను క్షేత్రస్థాయిలోని వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
– గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి
