వికారాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : యాసంగి సాగు జిల్లా రైతాంగానికి కష్టంగా మారింది. ఎండల తీవ్రత పెరుగుతుండడంతోపాటు అనధికార కోతలతో వరితోపాటు ఇతర పంటలు ఎండుముఖం పడుతున్నాయి. విద్యుత్తు సిబ్బంది సమయపాలన లేకుండా కోతలు విధిస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో త్రీఫేజ్ సరఫరా వేళల్లోనూ కోతలు విధిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న ది. రైతు భరోసా సాయం లేకుండా రెండున్నరేండ్లుగా రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు సరఫరాలోనూ ధోకా చేస్తున్నది. ప్రస్తుతం అధికారికంగా నాలుగు గంటలపాటు త్రీఫేజ్ విద్యుత్తు సరఫరాలో కోతలు విధిస్తున్నది. అనధికారికంగా ఓవర్ లోడ్ పేరిట ఎప్పుడు పడితే అప్పుడు సరఫరాను నిలిపేస్తున్నది. ఓ వైపు బోర్లు, బావుల్లో అడుగంటిపోతున్న భూగర్భజలాలకు తోడు కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగిలో సాగు చేసిన వరి తోపాటు ఇతర పంటలకు ఉన్న నీటిని కూడా అందించలేకపోతున్నారు. కరెంట్ కోతలతో రెండెకరాలకూ సాగు నీరందని దుస్థితి నెలకొన్నది. అప్పులు తెచ్చి సాగు చేసిన వరితోపాటు ఇతర పంటలు ఎండుముఖం పడుతుండడంతో పెట్టెడు దుఖంలో జిల్లా రైతాంగం మునిగిపోయింది. వరి సాగు చేసిన భూములు నీరులేక నెర్రెలు తేలిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకూ బోర్లలో నీటినిల్వల శాతం క్రమంగా తగ్గిపోతుండడంతోపాటు పవర్ కట్స్‌తో రైతాంగం ఆందోళనలో పడిపోయింది. రానున్న ఏప్రిల్ లో బోర్లలో నీటినిల్వల శాతం అంచనాలకు మించి తగ్గిపోవడంతోపాటు కరెంట్ కోతలు ఇలాగే కొనసాగితే జిల్లాలో సాగు చేసిన వరి పంటలో 70 శాతానికిపైగా ఎండిపోయే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇటీవల కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. రాత్రీపగలు అనే తేడా లేకుండా కోతలు కొనసాగుతున్నాయి. పంటలకు నీరు అందాలంటే పూర్తిగా పొలం వద్దే ఉండి మోటర్ ఆన్ చేయాల్సి వస్తున్నది. కరెంట్ పోయి వచ్చిన వెంటనే మోటర్ ఆన్ చేయడం.. నీరు పారబెట్టడం చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రతిరోజూ కోతలు కొనసాగుతున్నాయి.
– రొయ్యల చంద్రయ్య, రైతు, రుక్కుంపల్లి, పరిగి
నాకు మూడెకరాల పొలం ఉన్నది. అందులో కొంత స్థలంలో టమాట, మరికొంత స్థలంలో క్యాబేజీ, ఉల్లి పంటలను సాగు చేశా. వీటికి ప్రతిరోజూ నీరు అందించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. బోరు ఉందని పంటలను వేస్తే కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియడంలేదు. ఇలాగైతే పంట దిగుబడి తగ్గి అప్పులే మిగులుతాయి. గత బీఆర్ఎస్ హయాంలో కరెంట్ ఎప్పుడూ పోలేదు.. ఇరవై నాలు గు గంటలు ఉండేది. ఇప్పుడు ఎందుకు ఉండడం లేదు. గ్రామాల్లో అయితే విద్యుత్తు కోతలు అధికంగా విధిస్తున్నారు. పాలకులు రైతుల బాధను గుర్తించి కరెంట్ కోతలు లేకుండా చూడాలి. లేకుంటే పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలు కావాల్సి వస్తుంది.
– షాన్పాషా, రైతు, చిట్టిగిద్ద, నవాబుపేట
నాకు రెండున్నర ఎకరాల పొలం ఉండగా.. అందులో వరిని సాగు చేశా. బోరులో పుష్కలంగా నీరున్నా విద్యుత్తు సక్రమంగా ఉండడకపోవడంతో పంట ఎండిపోతున్నది. రాత్రీపగలు చేలు వద్దే ఉన్నా పంటకు నీరు అందని పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తే పంటలకు ఎంతో మేలు జరుగుతుంది.
– లాలూనాయక్, పులిచింతల మడుగుతండా, ధారూరు