యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు అభిషేకం చేశారు. తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో సుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణం జరిపించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు.
ఆలయ పుష్కరిణీ చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సత్యనారాయణుడిని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. శ్రీవారి ఖజానకు గురువారం రూ. 9,83,788 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
పాతగుట్టలో ముగిసిన అధ్యయనోత్సవాలు..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం అధ్యయనోత్సవాలు ముగిశాయి. మూడు రోజులుగా పురపాట్ సేవలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు ఆదివారం నాలుగోరోజు లక్ష్మీనరసింహస్వామిగా ఆలంకరించి ఆలయంలోనే ఊరేగించారు. ఆళ్వారాదుల ముందు ప్రబంధ పారాయణాలు పారాయణికులచే గావించారు. ఆళ్వారాదులు భగవానుడి యొక్క దివ్య స్వరూపాన్ని ఆయా పాశురాలలో పేర్కొని రీతిలో స్తుతించి భగవదనుగ్రహంను లోకమునకు అందింపచేయుట ప్రత్యేకను కలిగి ఉందని అర్చకులు తెలిపారు.
ఇరామానుజనుత్తందారి ఉపదేశరత్తినమాలై అనుసంధానం గావించి అధ్యయనోత్సవాలకు అర్చకులు, రుత్వికులు పరిసమాప్తం పలికారు. వేడుకల్లో ఆలయ అనువంశికదర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణా ధికారి గీత, పాతగుట్ట ఆలయ ప్రధానార్చకులు మాధవాచార్యులు, ఏఈవో దోర్భాల భాస్కర్ శర్మ, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.