యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు గురువారం ఉదయం 9 గంటలకు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి శేషవాహన సేవలో తిరు మాఢవీధుల్లో ఊరేగారు. నిత్య హోమం, చతుస్థానార్చనల అనంతరం శేషవాహన సేవలు అందుకున్నారు. వైకుంఠంలో స్వామివారికి నిరంతరం అవిచ్ఛనమైన సేవా కైంకర్యాలు చేసే సేవకుడు అనంతుడు.
అతనే ఆదిశేషు. అలాంటి ఆదిశేషుడిలో ప్రవాసుదేవుడిలా స్వామివారిని అలంకరించి ఆస్థానం చేశారు. వేదాలు, పురాణాలతో ప్రార్థించారు. భక్తజన బాంధవుడు లక్ష్మీనరసింహుడు ప్రీతిపాత్రమైన శేష వాహనుడిపై ఆలయ పునఃప్రారంభమైన అనంతరం తొలిసారిగా తిరు మాఢవీధుల్లో ఊరేగారు. సహస్ర ఫణితో గల శేష వాహనుడు లక్ష్మీసమేత నరసింహస్వామిని అధిరోహించుకుని భక్తజనులకు దర్శనమిస్తూ మంగళాశాసనాలు అందించారు.
బ్రహ్మోత్సవ శుభరాత్రుల్లో యాదగిరిగుట్ట కొండపై జ్వాలాకృతిలో, సర్పాకారంలో వెలిసిన స్వామివారిని భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి దివ్య అలంకార సేవ, రాత్రి దివ్య అలంకార సేవలు, హవన పూజలను యాజ్ఞికులు, ప్రధానార్చకులు చేపట్టారు. పూజల్లో కలెక్టర్ పమేలా సత్పతి, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్బల భాస్కర్‌శర్మ, ఆలయ ప్రధానార్చకులు నల్లన్‌థీఘళ్ లక్ష్మీనరసింహా చార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞికులు, ఉప ప్రధానార్చకులు పాల్గొన్నారు.
నేడు వటపత్రశాయిగా
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారు వటపత్రశాయి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి హంస వాహనంపై స్వామివారి సేవ కొనసాగుతుంది.
శేష వాహన సేవ విశిష్టత
వాహనం అనగా మోయునది అని అర్థం. భగవంతుడిని భక్తుల వద్దకు చేర్చు పరమభాగవతోత్తములను వాహనాలుగా స్వీకరించి భగవానుడు భక్తకోటికి దర్శనభాగ్యం కలిగించుచున్నాడని, బ్రహ్మోత్సవాల్లో ప్రప్రథమంగా శేషవాహనారూఢుడై భక్తులకు దర్శనం కలిగిస్తాడని అర్చకులు తెలిపారు. శేషశయ్యపై వేంచేసిన దర్శనం సర్వాభీష్ట ప్రదాయకం అని ఆళ్వారాదులు ప్రస్తుతించారన్నారు. సర్వేశ్వరుడికి ఆదిశేషుడు గొడుగుగా, సింహాసనంగా, పాదుకలుగా, వస్త్రంగా వివిధ రీతుల్లో కైంకర్యాలను నిర్వహించే పరమ భక్తాగ్రేసరుడు. భగవానుడు అర్చారూపిగా మూడు విధాలుగా వేంచేసి ఉన్నప్పుడు త్రివిధ కైంకర్యాలను ఏకకాలంలో నిర్వహించిన మహానుభావుడు ఆదిశేషుడు అని తెలిపారు. సకల దేవతలను, శ్రీహరి పాదపద్మములను నమస్కరించేప్పుడు పాదపీఠంగా ఉన్న ఆదిశేషుడికి సర్వదేవతాధిపతియైన శ్రీమహావిష్ణువు ప్రథమ నమస్కార అర్హతను అప్రయత్నంగా అనుగ్రహించడం ఆదిశేషువుపై పరమాత్మకు గల అవాజ్యమైన కృప. ఈ శేష వాహనారూఢుడైన అలంకార సేవలో దర్శించవచ్చునని వివరించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్టపైన ఉత్తర మాఢవీధుల్లోని రథశాల ముందు వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉమామహేశ్వరి బృందంలో వంద మంది కళాకారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన, టీకే సిస్టర్స్ (డాక్టర్ టీకే సరోజ, డాక్టర్ టీకే సుజాత) వారితో కర్ణాటక గాత్ర కచేరీ, శ్రీసాయి బృందంతో మోర్సింగ్ వాయిద్య కచేరి కార్యక్రమాలు అలరించాయి.
బ్రహ్మోత్సవ మండపంలోనే తిరుకల్యాణం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28న జరిగే తిరుకల్యాణ మహోత్సవం కొండపైన తూర్పు మాఢవీధుల్లో ఆగ్నేయ దిశలో నిర్మించిన బ్రహ్మోత్సవ మండపంలో నిర్వహించనున్నారు. ప్రధానాలయ పునఃప్రారంభానంతరం తొలిసారిగా జరిగే తిరు కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కల్యాణోత్సవంలో 10వేల నుంచి 13వేల మంది భక్తులు వచ్చినా తట్టుకునే విధంగా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. కల్యాణ మండపం ఎదురుగా వీవీఐపీ, వీఐపీ, దాతలు, భక్తులు కూర్చునే విధంగా ప్రత్యేకంగా బారికేడ్లను నిర్మిస్తున్నారు. సుమారు 8 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ రాజేశ్చంద్ర గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీవీఐపీలు రానున్న నేపథ్యంలో అందుకనుగుణంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, డీఈఓ దోర్బల భాస్కర్‌శర్మ, ఈఈ దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరం
యాదగిరిగుట్టలో స్వామివారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వంశీకృష్ణ, హరీశ్ ఆధ్వర్యంలో కొండపైన బస్టాండ్ వద్ద, కొండ కింద కల్యాణకట్ట వద్ద ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. భక్తులకు వైద్య సేవలు అందించారు.