యాచారం, ఏప్రిల్29 : వేసవిలో గ్రామాలలో మంచినీటి ఎద్దడి లేకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ నరేందర్రెడ్డి సూచించారు. మండలంలోని తాటిపర్తి, మేడిపల్లి గ్రామాలలో ఆయన మంగళవారం పర్యటించారు. తాటిపర్తి గ్రామంలో నెలకొన్న నీటి ఎద్దడిని ఆయన స్వయంగా పరిశీలించారు. తాగునీటి సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కరానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. నీరుండి నిరుపయోగంగా ఉన్న బోరుబావులను పరిశీలించారు. వాటికి మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలన్నారు.
మిషన్ భగీరథ నీటిని సరిపడా అందించేందుకు అధికారులు చొరవ చూపాలని సూచించారు. తప్పని పరిస్థితుల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని నిత్యం సరఫారా చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. అనంతరం మేడిపల్లి గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. నర్సరీ నిర్వాహణపై అధికారులను, నిర్వాహకులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. నర్సరీ మొక్కలకు తగిన నీరు అందించి వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ రాజు, ఏఈ సుభాష్, ఏఈ కార్తిక్ తదితరులున్నారు.