రంగారెడ్డి, జనవరి 7 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలనంటే జనం గొంతు నొక్కడమేనా అని యాచారం మండలంలోని ఫార్మాసిటీ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు తమకే ఇవ్వాలని, నిషేధిత జాబితా నుంచి తొలగించి, ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టించడం ప్రభుత్వానికి తగదని ప్రకటనలో పేర్కొన్నారు. ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి ఆటంకం లేకుండా ఎటువంటి అల్లర్లు, సమస్యలు సృష్టించడానికి వెళ్లకుండా శాంతియుతంగా ఫార్మా అనుబంధ గ్రామాలైన నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, మేడిపల్లి గ్రామాల్లో ఆందోళన చేస్తుండగా, పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.
బ్యానర్లతో గ్రామాల్లో తిరుగవద్దంటూ ఆంక్షలు విధించడమే కాకుండా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు పెడతామని భయపెట్టడం తగదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు, పాదయాత్రలు చేసినప్పటికీ ఇబ్బంది పెట్టలేదన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారని, ముఖ్యమంత్రిని కూడా.. నువ్వు ముఖ్యమంత్రివా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేసి భూములు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
గతంలో మేడిపల్లి గ్రామంలో కోర్టు స్టే ఉన్న భూముల్లో టీఎస్ఐఐసీ వారు పని చేస్తున్నారని, స్టే కాపీలు తీసుకెళ్లి చూపించగా పనులు నిలిపివేశారన్నారు. అప్పుడు కాంగ్రెస్ నాయకులు కోదండరెడ్డి స్వయంగా వచ్చి సహకరించారని, పోలీసులు కూడా స్టే ఆర్డర్ కాపీ చూపిస్తే సహకరించారన్నారు. కానీ, ఆగస్టు నెలలో కుర్మిద్ద గ్రామంలో కోర్టు స్టేకు వ్యతిరేకంగా టీఎస్ఐఐసీ అధికారులు మట్టి పరీక్షలు చేస్తుంటే పోలీసులు టీఎస్ఐఐసీకి సహకారమందించి రైతులను ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ఫార్మాసిటీ వ్యతిరేక కమిటీ సమన్వయకర్తలు కౌల సర్వతి, కుందారపు నారాయణ, యాచారం మండలంలోని ఫార్మాసిటీ బాధితులు భగవంత్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, అచ్చిరెడ్డి, విశాల్‌రెడ్డి, జక్కుల వెంకటేశ్, జంగయ్య, సాయిరెడ్డి, యాదయ్య, పాండు తదితరులు ఉన్నారు.
ఫార్మా పేరుతో బలవంతంగా భూములు లాక్కోవడం కోసం ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని, రైతుల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నదని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కౌల సరస్వతి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆయా రైతులకు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు నేడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, రైతులకు పూర్తి హక్కు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.