‘రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం జిల్లాకు రానున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం రూ.270 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పట్నం మహేందర్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అనంతరం షాద్‌నగర్ మార్కెట్ యార్డులో నిర్వహించే భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
-రంగారెడ్డి, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. షాద్‌నగర్ పట్టణంలో, కొత్తూరులో డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేయడంతోపాటు, కొత్తూరులో మున్సిపాలిటీ నూతన భవనాన్ని, నందిగామ మండలంలో గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభిస్తారు. మొత్తంగా రూ.270 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. షాద్‌నగర్‌లో రూ.కోటితో నిర్మించనున్న బంజారా భవన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రులు సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహేందర్‌రెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. షాద్‌నగర్ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
షాద్‌నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో గురువారం నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్‌తోపాటు ఆయన వెంట వచ్చే నేతలకు స్వాగతం పలుకుతూ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. దీంతో షాద్‌నగర్, కొత్తూరు, నందిగామ పరిసర ప్రాంతాలు గులాబీమయమయ్యాయి. బహిరంగ సభ విజయవంతం కోసం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, స్థానిక బీఆర్ఎస్ నేతలంతా ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వివిధ వర్గాల ప్రజానీకం పెద్దఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా తరలిరావాలని నేతలు పిలుపునిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేటీఆర్ పర్యటిస్తుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు విజయవంతానికి అహర్నిశలు కృషిచేస్తున్నాయి.
నందిగామ : మండలంలోని చాకలిగుట్టతండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి ప్రారంభించనున్నారు. సర్పంచ్ రాజూనాయక్ ఆధ్వర్యంలో హెలీప్యాడ్ స్థలాన్ని, ఏర్పాట్లను పోలీసులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. నందిగామ నుంచి షాద్‌నగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత జాతీయ రహదారిపై షాద్‌నగర్ వరకు బ్యానర్లు, బీఆర్ఎస్ జెండాలను ఏర్పాటు చేశారు.
* 9.45 : హెచ్ఐసీసీ కొత్తగూడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు.
* 10.30 : నందిగామ వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. నందిగామ మండలంలోని చాకలిదనిగుట్టతండాలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, అనంతరం రూ.3.50 కోట్లతో నిర్మించిన కొత్తూరు మున్సిపల్ కార్యాలయ నూతన భవనాన్ని, ఆతర్వాత రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన 60 డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేస్తారు.
* 11.00 : రోడ్డు మార్గాన కొత్తూరుకు చేరుకుంటారు.
* 11.15 : షాద్‌నగర్‌కు చేరుకుని రూ.96.07 కోట్ల వ్యయంతో నిర్మించిన 1,980 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభిస్తారు. అనంతరం రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న బంజారా భవన్‌కు శంకుస్థాపన చేస్తారు. రూ.270 కోట్లతో నిర్మించిన షాద్‌నగర్- కొత్తూరు నాలుగు లేన్ల రహదారితోపాటు వీధి లైట్లను ప్రారంభిస్తారు.
* 11.45 : షాద్‌నగర్ మార్కెట్ యార్డులో జరుగనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.