పెద్దేముల్, ఆగస్టు 9 : ఉన్నత చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్‌జైన్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, కొమురంభీం, చెంచు లక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి, ఆదివాసీల పచ్చజెండాను ఆవిష్కరించారు. అనంతరం బహుళ ప్రయోజన కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని విద్యను అభ్యసించాలన్నారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి విద్య, ఉద్యోగాల్లో అణగారిన ప్రజల ఎదుగుదలకు అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. పీఎం జన్మన్ పథకంలో భాగంగా కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికీ విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్ల వంటి వసతుల కల్పనకు ఇంటింటి సర్వే నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శి నాగరాణిని ఆదేశించారు.
చైతన్యనగర్‌లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. అంతకుముందు చైతన్యనగర్లోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో అధికారులు,నాయకులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఆలపించిన పాటలు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. అనంతరం ఆదివాసీల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు, సంఘాల నాయకులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కమలాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో పాల్వన్ కుమార్, తాండూరు మైన్స్ ఏడీ, మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, తహసీల్దార్ కె.కిషన్, ఎంపీడీవో జర్నప్ప, డీఎల్పీవో శంకర్ నాయక్, ఎంపీవో రతన్ సింగ్, ఏవో నసీరుద్దీన్, విద్యుత్తు డీఈ భానుప్రసాద్, ఆదివాసీ సంఘం రాష్ట్ర నాయకులు అంజయ్య, హన్మంతు, ఐటీడీఏ సిబ్బంది వినోద్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.