Murder for Death | షాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): నగల కోసమే ఓ మహిళను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నగల కోసమే షాబాద్ మండలం మన్మర్రి గ్రామ వాసి జటని సత్యమ్మను హత్య చేశారని షాబాద్ సీఐ కాంతారెడ్డి గురువారం విలేకరుల సమావేశంలో చెప్పారు. షాబాద్ మండలం మన్మర్రి గ్రామ వాసి జటని సత్యమ్మ(65) ఇటీవల హత్యకు గురైంది. ఫరూఖ్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామవాసి వత్యావత్ అనిల్ కుమార్ తల్లితండ్రులు చనిపోవడంతో తన అమ్మమ్మ ఊరైన కొందుర్గు మండలం కాస్లాబాద్ తండాలో ఇల్లు కట్టుకొని అక్కడే నివసిస్తున్నాడు.
గతంలో రెండు బొలెరో వాహనాల్లో పీడీఎస్ బియ్యం సరఫరా చేస్తూ పోలీసులకు పట్టు పడడంతో అనిల్ కుమార్‌పై కేసు నమోదు అయింది. జీవనోపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈనెల 8న అనిల్ హ్యుండాయ్ (టీఎస్ 10ఇబి 5639)కారులో షాద్ నగర్ వైపు వస్తుండగా మార్గమధ్యంలో లింగారెడ్డి గూడ బస్టాప్ వద్ద అప్పారెడ్డిగూడ గ్రామవాసులు బీబీ, జటని సత్యమ్మ లిఫ్ట్ అడిగి కారు ఎక్కారు. మార్గమధ్యంలో మొగిలిగిద్ద వద్ద బీబీ కారు దిగిపోయింది.
షాద్ నగర్ కంటి ఆసుపత్రికి వెళుతున్న సత్యమ్మ కారులో వెళ్ళింది. ఆమె ఒంటిపై ఉన్న నగలు చూసి దురాశతో అనిల్ రంగంపల్లి బస్టాప్‌కు సమీపాన ఎవరు లేని నిర్మానుష ప్రాంతంలోకి తీసుకువెళ్లి నగలు ఇవ్వమని కారులోనే ఆమెపై దాడి చేశాడు. స్పృహ కోల్పోయిన సత్యమ్మను ముళ్ళ పొదల్లోకి ఈడ్చుకు వెళ్లి రాయితో తలపై కొట్టి చంపాడు. మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె ఒంటిపై ఉన్న అర కిలో వెండి ఆభరణాలు, ఐదు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని పరారయ్యాడు.
పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా రికార్డులను పరిశీలించి కారు నంబర్ ఆధారంతో నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే నగల కోసం హత్య చేసినట్టు ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించారు. మీడియా సమావేశంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయుడు, ఎస్ఐ సతీష్ తదితరులు పాల్గొన్నారు.