Vikarabad | బొంరాస్‌పేట, జూన్ 25 : మండల పరిధిలోని మేడిచెట్టు తండా గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న బోడబండ తండాలో ఉపాధ్యాయురాలు సుమలత, యూత్ అధ్యక్షులు మల్లేష్, బిఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
బోడబండ తండాకు చెందిను సుమారు 50 మంది విద్యార్థులు బాపల్లి, నందరపూర్, తుంకిమెట్లలోని ప్రయివేటు పాఠశాలలకు తరలివెళ్తున్నారు. ప్రయివేటు పాఠశాలల కంటే మెరుగైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నామని టీచర్ సుమలత పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. ప్రయివేటు స్కూళ్లకు ఫీజులు చెల్లించలేక అప్పుల పాలయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందామని, పిల్లలను ప్రయివేటు పాఠశాలలకు పంపకుండా.. సొంతూరులోనే చదివించేలా టీచర్ పేరెంట్స్‌ను ఒప్పించారు. దీంతో విద్యార్థుల పేరెంట్స్ ప్రయివేటు స్కూళ్లకు తమ పిల్లలను పంపమని తీర్మానం చేశారు. సొంతూరులోని ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చదివిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోడబండ తాండకు చెందిన యువకులు శంకర్ నాయక్, మోహన్, ఉప సర్పంచ్ మనకి బాయ్ తదితరులు పాల్గొన్నారు.