మైలార్దేవ్పల్లి : తాగిన మత్తులో తరచూ వేధిస్తుండడంతో నిద్రిస్తున్న భర్తను భార్య హత్య చేసిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వట్టేపల్లి ప్రాంతానికి చెందిన షేక్ మహ్మద్, షేక్ ఫరీదా భార్యాభర్తలు. గత కొన్ని రోజులుగా షేక్ మహ్మద్ అధికంగా మద్యం తాగుతూ ఏమి పని చేయకుండా తిరుగుతున్నాడు. అలాగే భార్యను తరచు డబ్బు కోసం వేధిస్తున్నాడు.
మంగళవారం రాత్రి సైతం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీనిని భరించలేని భార్య బుధవారం ఉదయం నిద్రిస్తున్న భర్తను బండరాయితో తలపై కొట్టింది. తీవ్ర రక్తస్రావం కావడంతో షేక్ మహ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయాన్ని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారి సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.