రంగారెడ్డి, జూలై 20 (నమస్తే తెలంగాణ) : పింఛన్ల పెంపు ఎప్పుడంటూ వృద్ధులు, దివ్యాంగులు, గీత, బీడీ, నేత కార్మికులు, ఒంటరి మహిళలు ఆశగా ఎదురుచూస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.. పవర్లోకి వచ్చి 20 నెలలు దాటినా ఆ విషయాన్నే పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చేందుకు లేనిపోని హామీలిచ్చి ఓట్లు వేయించుకుని ఇప్పుడేమో మమ్మల్ని పట్టించుకోరా..? అని మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని వృద్ధులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు పేర్కొంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు తాము అధికారంలోకి రాగానే వృద్ధులు, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలకు రూ.4000, దివ్యాంగులకు రూ.6000 వరకు పింఛన్లను పెంచుతామని అప్పటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని.. అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటుతున్నా ఇంకా ఆ హామీని నెరవేర్చడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో 2,83,044 మంది వృద్ధులు, దివ్యాంగులు, బీడీ, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులు పింఛన్లు పొందుతున్నారు. వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
నేడు ఆమనగల్లులో పింఛన్ల పెంపుపై పోరుబాట
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ వృద్ధులు, దివ్యాంగులు, గీత, బీడీ, నేత కార్మికులు, ఒంటరి మహిళలు తదితరులు నేడు ఆమనగల్లులో దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించనున్నారు. దీనికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారు.
ప్రభుత్వ హామీని వెంటనే నెరవేర్చాలి
వృద్ధులు, దివ్యాంగులు, గీత, బీడీ, నేత కార్మికులు, ఒంటరి మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. హామీ ఇచ్చి 20 నెలలు దాటినా ఇంకా పెంచకపోవడం దారుణం. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారుల పింఛన్‌ను పెంచాలి.
– కాళ్ల జంగయ్య