కొడంగల్, ఆగస్టు 11 : అభివృద్ధి పేరుతో కొడంగల్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం నియోజకవర్గంలోని దుద్యాల మం డలం, హకీంపేటలో ఫార్మా కంపెనీల ఏర్పాటు తో భూములు కోల్పోనున్న రైతుల నిరసనకు మద్దతుగా ఆయన రోడ్డుపై బైఠాయించి వారికి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది ఆ ప్రాంతానికి, ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలని, సొంత లాభం కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హైదరాబాద్ శివారు తదితర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలను ప్రజలు వ్యతిరేకించడంతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొంటూ తిరస్కరించబడిన ఆ కంపెనీలను కొడంగల్ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఫార్మా కంపెనీల పేరుతో హకీంపేటలో 505 ఎకరాలు, పొలెపల్లిలో 130, లగచర్ల, పులిచర్ల, రోటిబండతండాల్లో 643 ఎకరాలు మొత్తంగా 1274 ఎకరాల భూములను లాక్కునేందుకు సీఎం కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. భూసేకరణ అనే ది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలే కానీ.. పేద రైతులను బెదిరించి బలవంతంగా భూములను లాక్కుంటే.. ఎంతటి పోరాటానికైనా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ నారాయణపేట మాజీ చైర్మన్ శ్యాసం రామకృష్ణ, దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ భీములు, మాజీ వైస్ ఎంపీపీ నారాయణరెడ్డి, మడిగ శ్రీనివా స్, నరేశ్‌గౌడ్, మల్లేశ్, నర్సింహులు, మణికంఠ, నారాయణ, వెంకటయ్య, శివకుమార్, గోపాల్‌నాయక్, భూబాధిత రైతు లు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ ప్రజలకు కాలుష్యాన్ని గిఫ్టుగా ఇవ్వాలనుకుంటున్నారు..
కొడంగల్ నియోజకవర్గంలో 1,154 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమి అన్యాక్రాంతమైందని ..ఆ భూముల జోలికి వెళ్లకుండా సాగు భూములు కావాలనుకోవడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుతో ఈ ప్రాంతం కలుషితంగా మారుతుందని..నీరు, వాతావరణ కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడతారన్నారు. కొడంగల్ ప్రజలు రేవంత్‌రెడ్డికి సీఎం పదవిని కట్టబెడితే.. ఆయన మాత్రం సెగ్మెంట్ ప్రజలకు కాలుష్య వాతావరణాన్ని గిఫ్టుగా ఇవ్వాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి ఈ ప్రాంత ప్రజలపై సీఎంకు ఏ విధమైన ప్రేమ, అభిమానం ఉందో ప్రజలు గుర్తించాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టే ఫార్మా, సిమెంట్ కంపెనీలను ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని.. ప్రజల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు.
భూముల ఆక్రమణ సరికాదు..
ఓ పక్క నియోజకవర్గానికి కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకంతో సాగునీరు అందిస్తామని చెప్పుకొంటూ .. మరో పక్క రైతుల భూములను ఆక్రమించుకోవడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ విధంగా సాగు భూములను లాక్కుంటూపోతే తీసుకొచ్చే ఎత్తిపోతల పథకం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీల స్వలాభం కోసమే ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తున్నట్లుగా ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మెడికల్, ఇంజినీరింగ్, వెటర్నరీ కళాశాలల ఏర్పాటును స్వాగతిస్తున్నామని.. ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
అభివృద్ధి పనులు చేపట్టేందుకు బీడు, గుట్టలు వంటి భూములను ఎంచుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, రైతులు కలిసికట్టుగా పోరాటం కొనసాగించాలని, సెంటు భూమిని కూడాఇచ్చేది లేదని ఖరాఖండిగా స్పష్టం చేశారు. పొల్యూషన్‌ను అంటగట్టే రేవంత్ సర్కార్ ప్రయత్నాలు తిప్పికొట్టేందుకు అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని, పార్టీలకతీతంగా రైతులకు అండగా నిలుద్దామని ఆయన పిలుపునిచ్చారు. రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంతో భారీ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి.