యాచారం, అక్టోబర్ 16 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఫార్మా రైతులు సిద్ధమవుతున్నారు. అధికార కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది ఫార్మా బాధిత రైతు లు జూబ్లీహిల్స్ ఉపపోరులో త్వరలో నామినేషన్లు వేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం కులం, ఆదాయం, ఇతరత్రా ధ్రువపత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ రైతులు, మహిళా రైతులను జూబ్లీహిల్స్ ఉప పోరులో పోటీ లో నిలిపేందుకు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు కవుల సరస్వతి, బందె రాజశేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌నాయక్, వెంకట్‌రెడ్డి కృషి చేస్తున్నారు.
ఇప్పటికే గ్రామపంచాయతీల్లో ఇంటిపన్నులు, నల్లా, విద్యుత్తు బిల్లులను క్లీయర్ చేసుకొని నోడ్యూస్ పత్రాలనూ తీసుకున్నారు. అధికారంలోకి రాగానే ‘ఫార్మాసిటీని రద్దు చేస్తామని, భూములను తిరిగి రైతులకు ఇస్తామని, నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతుల పేర్లను ఆన్లైన్లో నమోదు చేయిస్తామని గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కోదండరాం, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తదితరులు హామీ ఇచ్చి’.. అధికారంలోకి రాగానే తమను పట్టించుకోవడంలేదని రైతులు మండిపడుతున్నారు.
గతంలో ఫార్మాసిటీని రద్దు చేసి భూములను రైతులకు తిరిగి ఇప్పిస్తామన్న కాంగ్రెస్ నాయకులే .. నేడు ఆ భూములను ప్రభుత్వానికిస్తే సీఎంతో మాట్లాడి మంచి ధర ఇప్పిస్తామని మండలానికి చెందిన ఓ ముఖ్య నేత తమతో మంతనాలు జరుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవిలో లేనప్పుడు ఒకలా.. పదవిలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కాం గ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డు రైతుల పోరాటాన్ని తలపించేలా తమ పోరా టం ఉంటుందన్నారు.