పంటలకు జీవం పోసి ఆదరువు అవుతాయనుకున్న వర్షాలు దంచికొడుతూ చేలను ముంచెత్తుతున్నాయి. రైతులకు అపార నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట కురిసిన వర్షాల నుంచి తేరుకోక ముందే మళ్లీ కురుస్తున్న వర్షాలు జిల్లా రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు ఇటీవల కురిసిన వర్షాలకు తుడిచి పెట్టుకుపోయాయని ఆవేదన చెందుతున్నారు. పత్తి పం టకు ఎక్కువ మోతాదులో నష్టం జరుగగా.. వరిని సాగు చేసే సాహసాన్ని అన్న దాతలు చేయలేకపోతున్నారు. మరికొన్ని రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో వానకాలం సాగుపై రైతులు ఆశలు వదిలేసుకుం టున్నారు.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ)
గత యాసంగిలో కరెంటు కోతలు, వర్షాభావ పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతాంగాన్ని ఖరీఫ్‌లోనూ దురదృష్టమే వెంటాడుతున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పం టలు నీళ్ల పాలవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారం రోజుల కిందట కురిసిన వర్షాలకు జిల్లాలో 991 ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా పత్తి పంట 850 ఎకరాలకు పైగానే దెబ్బతిన్నది. ముం దుగానే సాగును మొదలుపెట్టిన ప్రాంతాల్లో పంటలు చేతికొచ్చే దశలో ఉండగా వర్షాలు ముంచెత్తి తీవ్ర నష్టాన్ని కలిగించాయి.
వీటితోపాటు కూరగాయలు, పండ్ల తోటలకూ తీవ్ర నష్టం జరిగింది. తెరిపినివ్వకుండా కురుస్తున్న వర్షాలకు నేటికీ కొన్ని చోట్ల వరద నీటిలోనే పంట పొలాలు మునిగి ఉన్నాయి. ఈ వానకాలంలో మూడు లక్షల ఎకరాల వరకు పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయ గా..ఇప్పటివరకు రెండు లక్షల పైచిలుకు ఎకరాల్లోనే వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇంకా కొన్నిచోట్ల సాగు చేయాల్సి ఉన్నది. అయితే ప్రస్తుత అతివృష్టి పరిస్థితుల్లో వరి వంటి పంటలను సాగుచేసే ధైర్యాన్ని రైతాంగం చేయలేకపో తున్నది. అదను దాటిపోతుండడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో.. జిల్లా రైతులు వానకాలం సాగుపై ఆశలను వదులుకుంటున్నారు.
పంటలకు చీడపీడల ప్రభావం ..
భారీ వర్షాలతో వివిధ పంటల్లో కొన్ని రకాల చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి పంటలు సాగవుతున్నాయి. పత్తి ప్రస్తుతం కాత, పూత దశలో ఉండగా..పొలాల్లో చేరిన నీటి నిల్వలతో చీడపీడలు పెరిగి దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. వరిలో ఎండు ఆకు, వేరు కుళ్లు తెగుళ్లు సోకవచ్చు. చాలాచోట్ల వరి నేలకొరగడంతో ధాన్యం నాణ్యత దెబ్బతిని తీరని నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన తమకు సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఆర్థిక భారమేనని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో 525.2 మి.మీ.ల వర్షపాతం..
జిల్లాలో ఆదివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 525.2 మి.మీల వర్షం కురవగా.. సగటున 19.5మి.మీ.లుగా నమోదైంది. అత్యధికంగా ఆమనగల్లులో 109.3మి.మీలు, తలకొండపల్లిలో 75.0, కేశంపేటలో 68.8, మా డ్గులలో 53.8మి.మీల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 27 మండలాల్లోనూ ఆశించిన మేరలో వర్షం కురిసింది. యథావిధిగా వాగులు, వంకలు ఉప్పొంగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.