రంగారెడ్డి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఓ వైపు వద్దంటే వర్షా లు కురుస్తుండగా.. మరోవైపు తాగునీటికోసం పలు ప్రాంతాల ప్రజలు అల్లాడుతున్న విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు కందుకూరు మండలంలోని ముచ్చర్ల పంపుహౌస్ నుంచి మిషన్ భగీరథ తాగునీరు సరఫ రా అవుతున్నది. ఇటీవల కందుకూరు మండలంలోని గుమ్మడవెల్లి, బేగంపేట గ్రామాల మధ్య 900 డయావాల్ పైపు పగిలిపోయింది.
దానికి సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో వా రం రోజులుగా పై మూడు సెగ్మెంట్లలోని ప్రజలు తాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పైపులైన్‌కు సంబంధించి కొత్త లైన్‌కు జాయింట్ దొరకడం లేదన్న సాకుతో మరమ్మతుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నదని స్థానికులు మండిపడుతున్నారు.
దీంతో ప్రజలకు ట్యాంకర్లు, ఫిల్టర్ వాటర్లే దిక్కయ్యా యి. మిషన్ భగీరథ నీరు వస్తుండడం తో గతంలో ఉన్న బోరుబావుల వినియోగం ఇక్కడ పూర్తిగా నిలిచిపోయిం ది. వారం రోజులు దాటినా మిషన్‌భగీరథ నీరు రాకపోవడంతో ఆయా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల అధికారులు చేతులెత్తేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
విపరీతంగా పెరిగిన ట్యాంకర్ల ధరలు..
మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయం లేక ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన ప్రజ లు ట్యాంకర్లు, వాటర్ ఫిల్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ట్యాంకర్ల నిర్వాహకులు గతంలో రూ. 600 ఉన్న ట్యాంకర్ ధరను రూ.800 పెంచారు. అలాగే, 20 లీటర్ల వాటర్‌క్యాన్ ధర గతంలో రూ. 20 ఉండగా ప్రస్తుతం రూ.40 నుంచి రూ.50కి అమ్ముతున్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ఇబ్రహీంప ట్నం, తుర్కయాంజాల్, ఆదిబట్ల, తుక్కుగూడ, రాజేంద్రనగర్ వంటి ము న్సిపాలిటీలు, ఆయా మండలాల్లోని గ్రామాల్లో ట్యాంకర్ల నీరే దిక్కైంది.