Water Problems | కందుకూరు, మార్చి 7 : మండల పరిధిలోని దాసర్లపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బానోతు సరితకు బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ మాజీ అధ్యక్షుడు పోలేమోని అశోక్ ముదిరాజ్తో కలిసి పలువురు నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి రావాల్సిన మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని తెలిపారు. ఈ విషయంలో పలుమార్లు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించాల్సిన ఆయన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గ్రామానికి రావాల్సిన నీరు సరిగా రావడం లేదని వివరించారు. దీంతో సమస్య తీవ్ర రూపం దాల్చిందని తెలిపారు.
గత 20 రోజుల నుండి సమస్య తీవ్రమైందని, అయినా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని తెలిపారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఒక్కనాడు కూడా తాగునీటి సమస్య రాలేదని తెలిపారు. అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నారని వివరించారు. సమస్య తీవ్రరూపం దాల్చకుండా నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఎంపీడీవో వెంటనే ఆర్డబ్ల్యూఎస్డీ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు జంబుల దయాకర్, కృష్ణయ్యలు పాల్గొన్నారు.