పరిగి, మే 13: పరిగి నియోజకవర్గంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం పోలింగ్ మందకొడిగా కొనసాగగా ఆ తర్వాత వేగం పుంజుకున్నది. సోమవారం ఉదయం 7 గంట లకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. పరిగి నియోజకవర్గంలోని 305 పోలింగ్ కేంద్రాల్లో 305 మంది పోలింగ్ ఆఫీసర్లు, 305 మంది ఏపీవోలు, 610 మంది ఓపీవోలు పోలింగ్ విధులు నిర్వహించారు. మొత్తం 125 పోలింగ్ కేంద్రాల్లో లొకేషన్ కెమెరాలు, 60 కేంద్రాలలో బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 65 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్‌ను పర్యవేక్షిం చారు. పరిగి నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 10.9శాతం, ఉదయం 11 గంటల వరకు 25.61 మధ్యాహ్నం ఒంటి గంట వరకు 43.57 మధ్యాహ్నం 3 గంటల వరకు 56.36 సాయంత్రం 6 గంటల వరకు 65.98 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్‌ను వికారాబాద్ ఆర్డీవో, ఏఆర్వో వాసుచంద్ర పర్యవేక్షించారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆర్డీవో పోలింగ్‌ను స్వయంగా పర్యవేక్షించారు. పోలింగ్ అనంతరం 27 రూట్లలో ఏర్పాటుచేసిన బస్సుల ద్వారా పోలింగ్ సిబ్బంది, ఈవీఎంలను పరిగిలోని మిని స్టేడియంలో ఏర్పాటు చేసిన రిసీవింగ్ సెంటర్‌కు తరలించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి-ప్రతిమారెడ్డి దంపతులు సోమవారం పరిగిలోని బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రం లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పర్యటించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పరిగిలోని బాలికల ఉన్నత పాఠశాలలో మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి సతీమణి గిరిజాదేవి, కుమారుడు అనిల్‌రెడ్డి, కోడలు శ్రీదీప్తి, కుమార్తె అర్చన, జడ్పీహెచ్ఎస్ నెం.2లో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, రంగాపూర్‌లో ఎంపీపీ కరణం అరవిందరావులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
తాండూరు: తాండూరు నియోజకవర్గంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తాండూరు అసెంబ్లీలోని 277 పోలింగ్ కేంద్రాల్లో 67.30 శాతం పోలింగ్ నమోదైనట్లు తాండూరు అసెంబ్లీ ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు సంబంధిత శాఖ అధికారులు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లకు సౌకర్యాలన్నీ కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తాండూరు ప్రభుత్వ నంబర్-1 పాఠశాలలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, జూనియర్ కళాశాలలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, యాలాల మండలం దౌలాపూర్‌లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్, మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతారెడ్డి, బషీరాబాద్ మండలం ఇందర్చెడ్లో మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి, తాండూరు పట్టణంలోని శంషార్గల్లి ప్రభుత్వ పాఠ శాలలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న విజయవిద్యాలయ పాఠశాలలో ఓటు హక్కును విని యోగించుకున్నారు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు తమ మండల పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కొడంగల్: నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం 282 పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి ఘటనలు తలెత్తలేదు. నియోజకవర్గంలోని కోస్గి మండల పరిధి మీర్జాపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళా శాలలోని పోలింగ్ కేంద్రంలో భారత సైనిక విభాగంలో శ్రీనగర్‌లో ఆర్మీ కర్నల్ విధులు నిర్వహిస్తున్న రవికుమార్, తల్లిదండ్రులు శీలాదేవి, అశోక్‌కుమార్ కులకర్ణిలతో కలిసి ఓటు వేశారు. సెలవుల్లో స్వగ్రామానికి వచ్చిన ఆయన మొదటి సారిగా ప్రత్యక్షంగా ఓటు వేసినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో విధుల్లో ఉన్న కారణంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశానని, ప్రత్యక్షంగా సొంత గడ్డపై పోలింగ్‌లో పాల్గొని ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు చోట్ల మాడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఓటర్ల ద్వారా పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. పర్సాపూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రం లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలిం చారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు బారులు తీరారు. మొత్తంగా 71.5శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
మర్పల్లి: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.. సోమవారం మండల కేంద్రంలోని 23వ పోలింగ్ బూత్‌లో మండల నాయకులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
బొంరాస్‌పేట: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో ప్రశాంతంగా జరిగింది. బొంరాస్‌పేట మండలంలో 39, దుద్యాల మండలంలో 30 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం మందకొడిగా ప్రారంభ మైన పోలింగ్ రానురాను పుంజు కుంది. తండాల నుంచి ఓటర్లు ట్రాక్టర్లలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరు గకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నవాబుపేట: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ జయమ్మ, ఎంపీపీ భవానీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, పులు మామిడి గ్రామానికి చెందిన మాజీ ఎమ్యెల్సీ యాదవరెడ్డి, వివిధ పార్టీల ముఖ్య నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
దోమ: మండల కేంద్రంతో పాటు 36 గ్రామ పంచాయతీలలోని 45 పోలింగ్ బూత్‌లలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మండల వ్యాప్తంగా 64 శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తన స్వగ్రామం శివారెడ్డిపల్లి లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల కేంద్రంలో ఎన్నికల తీరును పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసి లక్ష్మయ్య ముదిరాజ్, మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, నారా యణ, శ్రీనివాస్, సాయిలు, మైను, నరేశ్, హర్షద్ పాల్గొన్నారు.
ధారూరు: అల్లీపూర్ గ్రామ పోలింగ్‌స్టేషన్ నం 210 లో ఈవీఎం సాయం త్రం అరగంట సేపు మొరాయించింది. అధికారు లు వేరే ఈవీఎంను మార్చడంతో ప్రశాంతంగా ముగిసింది.