రంగారెడ్డి, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేస్తామన్న హామీ నెరవేరకపోగా.. మహిళా సంఘాల రుణాలు మాత్రం పక్కదారి పడుతున్నాయి. స్త్రీనిధి పథకం కింద మహిళా సంఘాలకిచ్చే రుణాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నా అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నా ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఒక మహిళా సంఘంలో రుణాల గోల్మాల్ వ్యవహారం తెరపైకి వస్తున్నది. సంఘాల్లో ఉన్న మహిళలందరికీ రావాల్సిన రుణాలను కొందరు గుట్టుచప్పుడు కాకుండా అందరి పేర్లతో స్వాహా చేస్తున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాలకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా స్త్రీనిధి రుణాలను మంజూరు చేయిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వీవోఏలు, పట్టణాల్లోని రిసోర్స్పర్స న్లు, మహిళా స్వయం సహాయ సంఘాల బాధ్యులు, బ్యాంకర్లతో కుమ్మక్కై ఏండ్లుగా వాడుకలో లేని ఖాతాలు, మహిళా సంఘాల పేరుతో నిధులను కొల్లగొడుతున్నారు. తీసుకున్న రుణాలకు ప్రతినెలా వడ్డీతో కలిపి అసలు చెల్లిస్తున్నా..వాటిని బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా సొంతానికి వాడుకుంటున్నారు.
జిల్లాలో 19,117 స్వయం సహాయ సం ఘాలుండగా వాటిలో 2,01,557 మంది సభ్యులుగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సెర్ప్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లోని సంఘాలకు మెప్మా ద్వారా రుణాలను అందిస్తారు. ఏటా రూ.700 కోట్ల -రూ. 800 కోట్ల వరకు రుణాలు ఇస్తుంటారు. 2025-26లో పలు బ్యాంకుల నుంచి రూ. 972 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. చిరు వ్యాపారులు, స్కూల్ యూనిఫాంలు కుట్టడం, మండల సమాఖ్య క్యాంటిన్, చేప ల విక్రయ సంచార వాహనాలు, సౌర విద్యుత్ ఉత్పత్తి వంటి 14 రకాల కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే యాచారం మండలంలోని మల్కీజ్‌గూడ, చౌదర్పల్లి , బడంగ్‌పేటలో అక్రమా లు వెలుగు చూడగా.. తాజాగా శంషాబాద్ మండలంలోని పాలమాకులలో ఇలాంటి ఘటనే జరిగింది. తీసుకున్న రుణాలకు వడ్డీ తో సహా అసలు చెల్లించాలని భావించిన మహిళలు తీరా తాము మోసపోయిన తెలి సి బెంగళూరు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
యాచారం మండలంలోని చౌదర్పల్లి, మల్కీజ్‌గూడ గ్రామాల్లో 70కి పైగా స్వయం సహాయక సంఘాలున్నాయి. వాటికి స్థానిక ఎస్బీఐ రూ.7 కోట్ల రుణాలిచ్చింది. ఆ మొత్తంలో రూ.3 కోట్లకు లెక్కలు లేకపోవటం చర్చనీయాంశమైంది. ఒక్కో సంఘం పేరున రూ.10 లక్షలకు పైగా అప్పులున్నట్టు రికార్డుల్లో తేలింది. ఎస్బీఐ మేనేజర్ సహా డ్వాక్రా సంఘాల పర్యవేక్షకులు కలిసి సంఘాల్లో లేని మహిళల పేరుతో బినామీ ఖాతాలు తెరిచి.. నిధులను దారి మళ్లించినట్టు తేలింది. ఏపీఎం, సీసీలపై సస్పెన్షన్ వేటు వేశారే తప్పా…అసలైన దొంగలను పట్టుకోవటంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన గ్రామీణ ప్రాంతాల్లోని బుక్‌కీపర్లు అమాయక మహిళలను ఆసరాగా చేసుకుని రూ.లక్షలు స్వాహా చేస్తున్నారు.
శంషాబాద్ మండలంలోని పాలమాకులలో 21 మహిళా సంఘాలండగా.. సభ్యులంతా కలిసి రూ. 1.56 కోట్లు జమ చేశారు. అయితే, మహిళల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు బ్యాంకులో జమ చేయకుండా విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్ (వీవోఏ) సొంతానికి వాడుకుంటున్నట్టు ఫిర్యాదులు అందాయి. అయినా అధికారులు స్పందించకపోవడంతో ఇటీవల ఆయా సంఘాల మహిళలు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. స్పందించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వీఏవోలు, బుక్‌కీపర్లు బ్యాంకర్లతో కుమ్మక్కై లక్షలాది రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.