
ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని సీతారాంనగర్ పంచాయతీ పరిధిలో బృహాత్ పల్లెప్రకృతి వనంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రతీ నెల పంచాయతీ ఖాతాలోనే అభివృద్ధి పనులకు నిధులు ఖాతాలో జమ అవుతున్నాయన్నారు.
పల్లెప్రగతి కార్యక్రమం కారణంగా పల్లెల రూపురేఖలు పరిశుభ్రతకు కేఆర్ఫ్గా మారాయని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకేళ్లాలని వారు కోరారు. మండలానికి ఒక బృహత్ పల్లెప్రకృతివనం ఏర్పాటు చేసి వాటి సుందరీకరణకు రూ. 12లక్షల నిధులు ప్రభుత్వం కేటాయించినట్లు ఎంపీడీవో వెంకట్రాములు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రకృతివనంలో వివిధ రకాలకు చెందిన 12వేల మొక్కలను నాటి వాటి నిర్వహణ చూసేందుకు ప్రత్యేకంగా ఐదు మంది వన సేవకులను నియమించినట్లు ఆయన తెలిపారు. పల్లెప్రకృతి వనాన్ని అందరి సహకారంతో ఆహ్లాదకర వాతావరణంలో తీర్చి దిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అనితా, జడ్పీటీసీ అనురాధ, సర్పంచ్ లక్ష్మణ్, ఎంపీటీసీ సరిత, ఎస్సై ధర్మేష్ పాల్గొన్నారు.