వికారాబాద్, ఆగస్టు 22 : బూరన్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు.. అది ఏమైందని గ్రామస్తులు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ప్రశ్నించారు. శుక్రవారం వికారాబాద్ మండలం బూరన్పల్లి గ్రామంలో నిర్వహించిన పనుల జాతర కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హాజరయ్యారు. బూరన్పల్లి నుంచి ధన్నారం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బూరన్పల్లి వరకు బీటీ రోడ్డు పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20లక్షలతో చేపట్టి గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని గ్రామస్తులు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా గ్రామానికి ఒక కొత్త బోరు వేయాలని, ఇందిరమ్మ ఇండ్లు 10 మందికే వచ్చాయని, మరి కొంతమందికి ఇవ్వాలని కోరారు. భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ భూమిని ఇవ్వాలని కోరారు. శ్మశాన వాటికలోకి వరద నీరు రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో హామీ ఇచ్చిన విధంగా బూరన్పల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ వారం రోజుల్లో నీటి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, భూమి లేని నిరుపేదలను గుర్తించి వారికి భూములు ఇస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు పూర్తిగా చేసే ప్రయత్నం చేస్తున్నామని, రానున్న రోజుల్లో మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం, పింఛన్లు తదితర వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో వినయ్‌కుమార్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఆర్టీఏ సభ్యులు జాఫర్, గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీవో దయానంద్ తదితరులు పాల్గొన్నారు.