మొయినాబాద్, ఏప్రిల్ 3 : వీసాల దేవుడిగా.. భక్తుల కొంగుబంగారం చేసే స్వామిగా.. దేశం నుంచి విదేశాల వరకు ప్రాచూర్యం పొందిన ఆలయంగా పేరు పొందిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు రెండేండ్ల తరువాత పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరానా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించవద్దని, భక్తుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని బ్రహ్మోత్సవాలను నిర్వహించలేదు. కానీ, ఈ ఏడాది మాత్రం స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తులు మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. ఉత్సవాలకు సంబంధించిన కర పత్రాన్ని ఉగాది పర్వదినం సందర్భంగా ఆవిష్కరించారు. ఆలయ నిర్వాహకులు బ్రహ్మోత్సవాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఆలయం ఉండటం చిలుకూరు బాలాజీ స్వామి మీద అపారమైన భక్తి కలిగిన వారు ఉండటంతో ఈ ఏడాది వేడుకలకు భారీగా రావచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ నెల 11న బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 18న ముగియనున్నాయి.
ఆలయ ప్రత్యేకత..
చిలుకూరు బాలాజీ దేవాలయంలో స్వామివారి దర్శనానికి ఒకే మార్గం. దైవదర్శనానికి ఎలాంటి టికెట్లు లేవు. ప్రత్యేక వీఐపీ క్యూలైన్లు లేవు. స్వామివారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి కానుకలు సమర్పించాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇక్కడ హుండీ లేదు. అనతికాలంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో కొలువుదీరిన బాలాజీని భక్తజనం ఆపదల మొక్కుల వాడిని వీసాల దేవుడని పిలుచుకుంటారు. మనసులోని కోరికలను స్వామికి సమర్పించుకునే ముందు 11 ప్రదక్షణలు, మొక్కు తీరాక 108 ప్రదక్షణలు చేయడం ఇక్కడ ప్రత్యేకత. స్వామి వారికి చెల్లించుకున్న మొక్కులు నెరవేరడంతో భక్తులు చిలుకూరి వేంకటేశ్వరస్వామికి వీసాల దేవుడిగా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తిరుపతిగా భక్తులే నామకరం చేసుకున్నారు. దీంతో ఆలయం దేశంలోనే కాకుండా, ప్రపంచ దేశాల్లో ఎంతో ప్రాచూర్యం పొందింది.
ద్వజారోహణం రోజున లక్షల్లో భక్తులు
బ్రహ్మోత్పవాల్లో ప్రధాన ఘటమైన ద్వజారోహణ కార్యక్రమానికి భక్తులు లక్షల్లో తరలివస్తారు. ఈ నెల15వ తేదీ ఉదయం ద్వజారోహణం కార్యక్రమం ఉంటుంది. ఈ రోజున ఆలయ గర్భ గుడి ఎదుట ఉన్న ద్వజ స్తంభంపై గరుడ పతాకాన్ని ఆరోహణం చేస్తారు. ఈ సందర్భంగా గరుడ్మంతుడికి నైవేధ్యంగా సమర్పంచే నైవేధ్యాన్ని భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు. గరుడ్మంతుడికి నైవేధ్యంగా పెట్టే ప్రసాదాన్ని సంతాన ప్రాప్తి లేని వారికి వితరణ చేస్తారు. దీంతో ప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రసాద వితరణ కార్యక్రమం ఉదయం 7 గంటల నుంచే ప్రారంభించనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. భక్తులను ఒక క్యూ పద్ధతిలో కూర్చో బెట్టి ఆలయంలోని ద్వజస్తంభం వద్ద ప్రసాదం వితరణ చేస్తారు.
బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు
ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. 11వ తేదీన సెల్వర్ కూత్తుతో ప్రారంభమై 18వ తేదీన చక్రతీర్థం, ద్వజావరోహణంతో ముగుస్తాయి. 11న సెల్వర్ కూత్తు, అంకురార్పణం, 12న ధ్వజారోహణం, శేషవాహనం, 13న గోప వాహనం, హనుమంత వాహనం, 14న సూర్యప్రభ, గరుడ వాహనం, రాత్రికి స్వామివారి కల్యాణోత్సవం, 15న వసంతోత్సవం, గజ వాహనం, 16న స్వామివారి పల్లకీ సేవా, రాత్రికి రథోత్సవం, 17వ తేదీన మహాభిషేకం, అశ్వ వాహనం, దోప్ సేవ, పుష్పాంజలి, 18న చక్రతీర్థం, ద్వజావరోహణం, ద్వాదశారాధనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
లోకాంతంగా బ్రహ్మోత్సవాలు
రెండేండ్ల పాటు కరోనా వైరస్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి సేవలు, కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహించాం. కానీ ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నాం. కల్యాణోత్సవం, రథోత్సవం లోకాంతంగా నిర్వహిస్తాం. స్వామి వారి గరుడ ప్రసాదాన్ని ఈ నెల 12న ధ్వజారోహణం ఉదయం 9 గంటల నుంచి వితరణ చేస్తాం. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గరుడ ప్రసాదం స్వీకరించాలి. ఎండలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేపట్టాం.
– సీఎస్ రంగరాజన్, ఆలయ ప్రధాన అర్చకులు