చేవెళ్లటౌన్, ఏప్రిల్ 2 : చలివేంద్రాలతో బాటసారుల దాహార్తి తీరుతుందని చేవెళ్ల ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ పక్కన సత్యసాయి బాబా సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చలివేంద్రాన్ని చేవెళ్ల సర్పంచ్ బండారి శైలజ, మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌లతో కలిసి ఏసీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎస్ఐ అబ్దుల్ , సత్యసాయి సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
దాతలు ముందుకు రావాలి
షాబాద్ : వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని, మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు రావాలని షాబాద్ సీఐ అశోక్‌కుమార్ అన్నారు. శనివారం మండల పరిధిలోని నాగరగూడ, షాబాద్ గ్రామాల్లో చలివేంద్రాలను సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎండలు అత్యధికంగా ఉండటంతో ప్రజలకు చల్లని నీటిని అందించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని చెప్పారు. ప్రజలు ఎండలో తిరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బజరంగ్దళ్ విభాగ్ జిల్లా కో కన్వీనర్ గూడెం రమేశ్, మండల కన్వీనర్ గోపాల్, ధనుష్‌రెడ్డి, నాయకులు మాధవరెడ్డి, శ్రీకాంత్, మహేశ్ పాల్గొన్నారు.
చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషకరం
గ్రామాల్లో యువకులు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషకరమని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, మిర్జాగూడ సర్పంచ్ రవీందర్‌గౌడ్ అన్నారు. శనివారం మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డినగర్‌లో కిషన్‌సింగ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశం, కిషన్‌సింగ్, వార్డు సభ్యులు ప్రవీణ్‌కుమార్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు గోపాల్, మాజీ వార్డు మెంబర్ ఎం.ఆంజనేయులు, నాయకులు బాలస్వామి, హనుమయ్య, సీహెచ్ కుమార్, తిరుపతయ్య, మల్లేశ్, ఎం.రాజు, రాపని అంజి పాల్గొన్నారు.