పరిగి, నవంబర్ 22 : పోడు భూముల సమస్య పరిష్కారానికి నిర్ణయించిన సర్కారు దరఖాస్తులను స్వీకరించింది. అటవీ భూముల్లో సాగు చేస్తున్నవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించగా వికారాబాద్ జిల్లా పరిధిలో 9768 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా పరిధిలో 108791 ఎకరాల అటవీ భూములుండగా, 13 మండలాల పరిధిలోగల 27 స్థలాల్లో 2449.48 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైందని మొదట అధికారులు తేల్చారు. వాస్తవానికి ఎంత మేరకు ఆక్రమణకు గురైంది అనే అంశం దరఖాస్తులు వచ్చిన తర్వాత తేలుతుందని అధికారులు భావించారు. ఈ నెల 8 నుంచి పోడు భూముల సమస్యపై ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో భాగంగా పోడు భూముల సమస్య పరిష్కారానికి ఈ నెల 8న నిర్వహించిన గ్రామసభల్లో సర్పంచ్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో రెవెన్యూ, గిరిజన అభివృద్ధి శాఖ అధికారులతోపాటు ఏడుగురు గిరిజన రైతులు సభ్యులుండగా వారిలో ముగ్గురు గిరిజన మహిళా రైతులు ఉండేలా చూశారు. వీటితోపాటు మండలస్థాయి, జిల్లాస్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేయగా.. కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి కో-కన్వీనర్‌గా, జిల్లా అటవీ శాఖ అధికారి, తదితరులు జిల్లా కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నిమమించారు. ఈ నెల 8 నుంచి మొదటి మూడు రోజులు ఆయా గ్రామాల్లో ప్రజలకు పోడు భూములకు సంబంధించి అవగాహన కల్పించారు. అనంతరం వారి నుంచి అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు.
9768 దరఖాస్తులు.. 22326.3 ఎకరాలు
జిల్లా పరిధిలో పోడు భూములకు సంబంధించి 9768 దరఖాస్తులు అందాయి. మొదట ఈ నెల 17 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు విధించగా, ఈ గడువును 20వ తేదీ వరకు పొడిగించారు. గడువు లోపు మొత్తం 9768 దరఖాస్తులు అందాయి. ఇందులో ఎస్టీలు 4883 మంది 11193.01 ఎకరాల భూమి, ఇతరులు 4885 మంది 11133.3 ఎకరాల భూమికి దరఖాస్తు చేసుకున్నారు. ఆయా గ్రామపంచాయతీల్లో దరఖాస్తులను స్వీకరించారు. ఎస్టీలలో గిరిజనులు, ఎరుకలి, చెంచులు ఉండగా అత్యధిక శాతం గిరిజనులే అటవీ భూములు సాగులో ఉన్నారు. ఈ మేరకు ప్రతి గ్రామంవారీగా దరఖాస్తులు, భూముల వివరాలతో జిల్లాస్థాయి అధికారులు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు నివేదికను పంపించారు. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల ఆదేశాల తర్వాత, నిబంధనల మేరకు ఆయా దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపడుతారు. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారానికి సర్కారు నిర్ణయించడంతో త్వరలోనే ఈ ఫిర్యాదుల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించే అవకాశం ఉన్నది.
ఉన్నతాధికారుల ఆదేశాలతో పరిష్కారం